అమ్మకు భారం కావొద్దని.. | Unemployed man commits suicide by consuming pesticide | Sakshi
Sakshi News home page

అమ్మకు భారం కావొద్దని..

Feb 22 2026 4:06 AM | Updated on Feb 22 2026 4:06 AM

Unemployed man commits suicide by consuming pesticide

పురుగుమందు తాగి నిరుద్యోగి ఆత్మహత్య

గ్రూప్స్‌ రాసినా రాకపోవడంతో మనస్తాపం

చెన్నూర్‌: చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్లాడు. అమ్మే కూలీ పనులు చేస్తూ.. ఇద్దరు కొడుకులను పోషిస్తూ డిగ్రీ వరకు చదివించింది. అమ్మమ్మ కూడా వీరికి సాయంగా ఉంటోంది. పెద్ద కొడుకు ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చిన్న కొడుకు రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రిపేర్‌ అవుతూ గ్రూప్స్‌ రాసినా ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో మనస్తాపం చెందిన నిరుద్యోగి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జరిగింది. 

పట్టణంలోని కోటబొగూడ కాలనీకి చెందిన ఒద్ది కిరణ్‌ (24) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి కష్టాన్ని చూడలేక ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్లో ఉంటూ గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. గ్రూప్‌–2, 3, 4 రాసినా రాలేదు. దీంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు చెన్నూర్‌కు వచ్చాడు. తల్లి, అమ్మమ్మ కుటుంబ పోషణకు పడుతున్న కష్టాన్ని చూసి మనస్తాపం చెందాడు. 

ఈనెల 19న ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బన్సీలాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement