భూ పటాలు.. విశిష్ట సంఖ్యలు | Land survey numbers to lose importance in Telangana | Sakshi
Sakshi News home page

భూ పటాలు.. విశిష్ట సంఖ్యలు

Feb 22 2026 1:32 AM | Updated on Feb 22 2026 1:32 AM

Land survey numbers to lose importance in Telangana

కొత్త పుంతలు తొక్కనున్న రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ 

భూముల సర్వే నంబర్లకు తగ్గిపోనున్న ప్రాధాన్యత

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఎల్‌పీఎంలు, యూనిక్‌ నంబర్లే ప్రాతిపదిక

త్వరలో అమల్లోకి ‘సర్వే మ్యాప్‌ తప్పనిసరి’నిబంధన

ఈ నిబంధన అమలైతే ప్రతి లావాదేవీ సందర్భంగా భూమిని సర్వే చేయాల్సిందే

సర్వే కాగానే ఆ భూ కమతానికి ఎల్‌పీఎం నంబర్‌.. ఇక భూ వివాదాలకు చెక్‌!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కబోతోంది. ఈ వ్యవస్థలో ఇప్పటివరకు కీలకమైన భూముల సర్వే నంబర్లు కాలక్రమేణా అప్రాధాన్య అంకెలుగా మిగలబోతున్నాయి. భూములు సరిహద్దులు పక్కాగా నమోదు చేయడంతో పాటు భూ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు వీలుగా త్వరలో రానున్న ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) నంబర్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ భూముల క్రయ విక్రయాల సందర్భంగా వీటి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇందుకోసం రెవెన్యూ శాఖ వడివడిగా కసరత్తు చేస్తోంది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రతి వ్యవసాయ భూకమతం రిజిస్ట్రేషన్‌ సందర్భంగా ఆ భూమి పటం (సర్వే మ్యాప్‌) తప్పనిసరి అనే నిబంధన రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అమలు కానుంది. ఈ నిబంధనను జనవరి 26వ తేదీ నుంచే అమల్లోకి తెస్తామని రెవెన్యూ శాఖ గతంలో ప్రకటించినప్పటికీ చలాన్ల కుంభకోణం వెలుగులోనికి రావడం, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక వచ్చిన నేపథ్యంలో కొంత ఆలస్యమయ్యిందని, త్వరలోనే సర్వే మ్యాప్‌ నిబంధన అమల్లోకి తెస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఆ నంబర్‌ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు 
రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాప్‌ తప్పనిసరి అనే నిబంధనను ఫలానా తేదీ నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అప్పట్నుంచి రాష్ట్రంలోని ఎక్కడైనా భూమిని అమ్మేందుకు లేదా కొనేందుకు భూభారతి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేయాల్సి ఉంటుంది. ఈ స్లాట్‌ బుకింగ్‌ సమయంలోనే ఆ భూకమతం సర్వే మ్యాప్, ఎల్‌పీఎం నంబర్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ నంబర్‌ అప్‌లోడ్‌ చేస్తేనే స్లాట్‌ బుక్‌ అవుతుంది. 

ఆ విధంగా ఒకసారి యూనిక్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ అయిన భూమి ఇక ఎప్పుడు రిజిస్ట్రేషన్‌కు వచ్చినా అదే నంబర్‌ ఆధారంగా, ఆ నంబర్‌తో ఉన్న సర్వే మ్యాప్‌లో పేర్కొన్న విస్తీర్ణం ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ చేసేలా రెవెన్యూ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మేరకు భూభారతి పోర్టల్‌లో మార్పులు జరగనున్నాయి. అయితే ఇప్పటికే అమల్లో ఉన్న సర్వే నంబర్‌ వివరాలను, ఎల్‌పీఎం నంబర్‌ను అనుసంధానం చేసి రికార్డుల్లో ఉంచుతారు. అవసరాన్ని బట్టి సర్వే నంబర్‌ లేదంటే ఎల్‌పీఎం నంబర్‌ను ఉపయోగించుకుంటామని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 

ఎన్ని భూ కమతాలుంటే అన్ని నంబర్లు 
ఒక గ్రామంలో 150 సర్వే నంబర్లుంటే ఆ సర్వే నంబర్లలోని సబ్‌ డివిజన్ల వారీగా ఎన్ని భూకమతాలు ఉంటే అన్ని ఎల్‌పీఎం నంబర్లు ఇవ్వనున్నారు. ఇలా కాలక్రమేణా రాష్ట్రంలోని 2.29 కోట్ల భూకమతాలకు 2.29 కోట్ల ఎల్‌పీఎం నంబర్లు ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే సర్వే మ్యాప్‌ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చే రిజిస్ట్రేషన్‌ లావాదేవీలను బట్టి భూములకు ఎల్‌పీఎం నంబర్లు ఇస్తామని, ఏదైనా గ్రామంలో తొలుత జరిగే క్రయ విక్రయ లావాదేవీని ఎల్‌పీఎం–1గా నిర్ధారిస్తామని, అలా వరుసగా నంబర్లు ఇస్తామని వివరిస్తున్నారు. ఈ భూకమతాలను సర్వే చేసేందుకు గాను రాష్ట్రంలో ఇప్పటికే విధుల్లో చేరిన 6 వేల మంది లైసెన్సుడు సర్వేయర్లను ఉపయోగించుకుంటామని, ఒకవేళ అభ్యంతరాలు లేదా ఆ సర్వే మ్యాప్‌పై సందేహాలు వస్తే రెవెన్యూ శాఖలో పనిచేసే మండల సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసి అవసరమైతే సవరణలు చేస్తారని చెబుతున్నారు.  

మ్యాప్‌ తయారు చేసి నంబర్‌ కేటాయింపు
సర్వే నంబర్ల స్థానంలో ప్రాధాన్యత సంతరించుకోనున్న ఈ ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) నంబర్‌ గ్రామ స్థాయిలో అమలవుతుందని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న సర్వే నంబర్లు తొలగించేది లేదని, అయితే ఆ సర్వే నంబర్లతో పాటు ఎల్‌పీఎం నంబర్లను కూడా ఇస్తామని, భూముల రిజిస్ట్రేషన్లు ఈ ఎల్‌పీఎం నంబర్ల ఆధారంగానే జరుగుతాయని చెబుతున్నాయి. రెవెన్యూ వర్గాలు చెబుతున్న ప్రకారం..ప్రతి భూకమతం క్రయ, విక్రయం జరిగేటప్పుడు ఆ భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. సర్వే నంబర్‌లో పేర్కొన్న వి«వరాల ఆధారంగా ఆ భూకమతాన్ని సర్వే చేసి ఎంత విస్తీర్ణముందనే అంశాన్ని నిర్ధారిస్తూ, తాజాగా ఆ భూమికి హద్దులు ప్రతిపాదిస్తూ సర్వే మ్యాప్‌ను తయారు చేస్తారు. ఈ మ్యాప్‌నకు ఓ యూనిక్‌ నంబర్‌ ఇస్తారు. దీన్నే ఎల్‌పీఎం నంబర్‌ అంటారు. ఈ యూనిక్‌ నంబర్‌ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement