రైల్వేకోచ్‌ ఫ్యాక‍్టరీలో ట్రయల్‌రన్‌ | Trial run at the railway coach factory | Sakshi
Sakshi News home page

రైల్వేకోచ్‌ ఫ్యాక‍్టరీలో ట్రయల్‌రన్‌

Feb 22 2026 4:16 AM | Updated on Feb 22 2026 4:16 AM

Trial run at the railway coach factory

కాజీపేటలో తొలిసారి ఒక కోచ్‌తో ఉన్న రైలు ఇంజిన్‌ను నడిపిన అధికారులు

కాజీపేట రూరల్‌: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో చివరిదశ నిర్మాణంలో ఉన్న రైల్వే మల్టీపుల్‌ కోచ్‌ఫ్యాక్టరీ యూనిట్‌లో శనివారం అధికారులు ఒక కోచ్‌తో ఉన్న ఇంజిన్‌ను ట్రయల్‌ రన్‌గా నడిపించారు. రైల్వే మల్టీపుల్‌ యూనిట్‌లో చిన్నచిన్న పనులు చివరి దశలో ఉన్నాయి. పనులన్నీ పూర్తయ్యాక ఈ యూనిట్‌ను ఏప్రిల్‌ లేదా, మే నెలలో అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. 

పన్నెండున్నర కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మించి ట్రాక్‌ ఫిట్‌నెస్, స్పీడ్‌ను తనిఖీ చేసేందుకు మొట్టమొదటిసారి కాజీపేట రైల్వేస్టేషన్‌ యార్డు నుంచి రైల్వే మల్టీపుల్‌ యూనిట్‌ వరకు కోచ్‌తో జత చేసిన డీజిల్‌ ఇంజిన్‌ను ట్రయల్‌రన్‌గా నడిపించారు. ట్రయల్‌ ఇంజిన్‌ ఎటువంటి ఆటంకం లేకుండా మల్టీపుల్‌ యూనిట్‌ వరకు వస్తున్న క్రమంలో అధికారులు, సిబ్బంది ఆనందోత్సవాల మధ్య స్వాగతం పలికారు. 

యూనిట్‌ వద్ద ఇంజిన్‌ ముందు పూజ చేసి మెయిన్‌షెడ్‌ బేలోకి పంపించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులు సీపీఎం సాయిప్రసాద్, జీజీఎం మెకానికల్‌ మురళీకృష్ణ, సివిల్‌ డీజీఎం శర్మ, పవర్‌మెక్‌ ప్రాజెక్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రామచంద్రరాజు, ఏజీఎం కృష్ణ, సీనియర్‌ మేనేజర్‌ ప్రేమ్‌సాగర్, పవర్‌ మెక్‌ ఇంజనీరింగ్‌ బృందం పాల్గొన్నారు.  

15 ఏళ్ల కల సాకారం 
కాజీపేటకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో 2010–11లో రైల్వే వ్యాగన్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ మంజూరైంది. ఎన్నో ఉద్యమాల ఫలితంగా 2023 ఫిబ్రవరిలో 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.560 కోట్లతో రైల్వే వ్యాగన్‌ మాన్యుఫాక్చరింగ్‌ షెడ్‌ మంజూరైంది. తర్వాత కోచ్‌ ఫ్యాక్టరీ డిమాండ్‌ మేరకు 2023లో జిల్లాకు ప్రధాని నరేంద్రమోదీ వచి్చనప్పుడు రైల్వే మల్టిపుల్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. 

2025లో కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ తనిఖీకి వచ్చిన రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే మల్టిపుల్‌ మాన్యుఫాక్చరింగ్‌ కోచ్‌ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. నాటినుంచి నేటి వరకు పనులు వేగంగా జరిగి ప్రారంబోత్సవానికి సిద్ధమైంది.

Advertisement
 
Advertisement
Advertisement