కుప్పకూలిన ఆశలకు ఏడాది | 8 workers die in SLBC tunnel collapse | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన ఆశలకు ఏడాది

Feb 22 2026 4:45 AM | Updated on Feb 22 2026 4:45 AM

8 workers die in SLBC tunnel collapse

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుంగడంతో 8 మంది కార్మికుల దుర్మరణం    

అందులోనే ఉండిపోయిన ఆరుగురి మృతదేహాలు 

ఈనెల 17న అవుట్‌లెట్‌ నుంచి ప్రారంభమైన తవ్వకం పనులు 

ఇన్‌లెట్‌ వైపు నుంచి తవ్వకాలపై రాని స్పష్టత 

సవాలుగా మారిన 9.5 కి.మీ మేర సొరంగం తవ్వకం 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్ట్‌ సొరంగం కుంగిన ఘోర ప్రమాదానికి ఆదివారం నాటికి ఏడాది పూర్తికానుంది. గతేడాది ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్దనున్న ఇన్‌లెట్‌ వద్ద సొరంగం కుప్పకూలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. 

టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) ద్వారా సొరంగం తవ్వకం పనులు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా సొరంగం పైకప్పు కుప్పకూలడంతో శిథిలాల కింద పడి 8 మంది కార్మికులు మరణించారు. వీరిలో ఇద్దరి కార్మికుల మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఏడాది కావస్తున్నా ఇప్పటికీ సొరంగం ఇన్‌లెట్‌ వైపు నుంచి తవ్వకాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.  

అత్యాధునిక సాంకేతిక..నిపుణులు రంగంలోకి దిగినా.. 
ఘోర ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు గంటల వ్యవధిలోనే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూ, ఇండియన్‌ ఆర్మీ తదితర బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కేరళ నుంచి కడావర్‌ డాగ్స్‌తో పాటు ఉత్తరాఖండ్‌ గనుల్లో నిపుణులుగా ఉన్న ర్యాట్‌హోల్‌ మైనర్స్‌(ఇరుకైన ప్రదేశాల్లో చిక్కుకున్నవారిని రక్షంచే కార్మికులు) రోజుల తరబడి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

జాతీయ స్థాయి సంస్థలు ఎన్జీఆర్‌ఐ, రోబోటిక్స్, గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ (భూమి ఉపరితలాన్ని తవ్వకుండానే కింద ఉన్న వస్తువులు, మట్టిపొరలను గుర్తించడానికి రేడియోతరంగాలను ఉపయోగించే ఒక అధునాతన సాంకేతిక..ఈ టెక్నాలజీ కచ్చితంగా మృతదేహాలను మ్యాపింగ్‌ చేయగలదు), టన్నెల్‌ నిపుణుల సహాయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 

ఇద్దరు కార్మికుల మృతదేహాలు మాత్రమే లభించగా, మిగతా ఆరుగురి మృతదేహాలు శిథిలాల కిందే ఉండిపోయాయి. 50 రోజుల పాటు సహాయక చర్యలను కొనసాగించిన ప్రభుత్వం అనంతరం నిలిపివేసింది. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలను కలెక్టర్‌ సంతోష్‌ అందించారు.  

అవుట్‌లెట్‌ వైపు నుంచి మొదలైన తవ్వకాలు.. 
దోమలపెంట ఇన్‌లెట్‌ వైపు నుంచి పనులు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో అవుట్‌లెట్‌ వైపు నుంచి పనులను మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వద్దనున్న అవుట్‌లెట్‌ సొరంగం వద్ద హెలీబోర్న్‌ మాగ్నటిక్‌ సర్వే (హెలీకాప్టర్‌ సహాయంతో భూగర్భజలాలు, ఖనిజాలు, రాతినిర్మాణాలను గుర్తించడానికి ఉపయోగించే అధునాతన సాంకేతికత)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సర్వే ముగిసిన తర్వాత ఈనెల 17నుంచి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ మెథడ్‌(ఏటీఎం) పద్ధతిలో బ్లాస్టింగ్‌ ద్వారా సొరంగం తవ్వకాలను చేపడుతున్నారు. 

ఇంకా 9.5 కి.మీ మేర సొరంగం పెండింగ్‌.. 
మొత్తం 43.931 కి.మీ మేర ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా, ఇరువైపుల నుంచి పనులు మొదలుపెట్టారు. ఇన్‌లెట్‌ నుంచి 13.936 కి.మీ వరకు తవ్వకం పూర్తికాగా అక్కడే ప్రమాదం జరిగి టీబీఎం ధ్వంసమైంది. అవుట్‌లెట్‌ నుంచి ఇప్పటివరకు 20.435 కి.మీ మేర తవ్వకం పూర్తికాగా ఇంకా 9.533 కి.మీ సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. అవుట్‌లెట్‌ నుంచి సొరంగం లోపల 20 కి.మీ దూరంలో తవ్వకాలు పూర్తిచేయడం సవాలుగా మారింది.  

Advertisement
 
Advertisement
Advertisement