ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే.. | Cops Drag Goa MLA Out Of Govt Office After Overnight Stir | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Feb 22 2026 7:30 AM | Updated on Feb 22 2026 11:08 AM

Cops Drag Goa MLA Out Of Govt Office After Overnight Stir

పణజీ: గిరిజన భూమిని అక్రమంగా నిర్మాణాలకు అనువుగా సెటిల్‌మెంట్‌ జోన్‌లోకి మార్చారని, తక్షణం గత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ శుక్రవారం నుంచి టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(టీసీపీ) ప్రభుత్వ కార్యాలయంలో ధర్నాచేస్తున్న రెవల్యూషనరీ గోవాన్స్‌ పార్టీ(ఆర్‌జీపీ) ఎమ్మెల్యే వీరేశ్‌ బోర్కార్‌ను పోలీసులు శనివారం బలవంతంగా బయటకు లాగేశారు.

పణజీలోని పత్తో పరిధిలోని టీసీపీ ఆఫీస్‌లో వీరేశ్‌తోపాటు ధర్నాచేస్తున్న పలువురు నేతలు, గ్రామస్తులనూ పోలీసులు బలవంతంగా బయటకు లాగేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గిరిజన మహిళలనూ పోలీసులు అనుచితంగా పట్టుకుని లాగిపడేశారని గ్రామస్థులు ఆరోపించారు.

చట్టంలోని సెక్షన్‌ 39ఏను దుర్వినియోగం చేస్తూ సెయింట్‌ ఆండ్రీ నియోజకవర్గంలోని పాలెం–సిరిదావో గ్రామం పరిధిలోని 84,000 చదరపు మీటర్ల భూమిని అక్రమంగా నిర్మాణాలకు టీసీపీ మంత్రి విశ్వజిత్‌ రాణె అనుమతులు ఇచ్చారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని గ్రామస్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. టీసీపీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌చేశారు. ‘‘ఎమ్మెల్యేనని కూడా చూడకుండా నా మీదే పోలీసులు చేయి చేసుకున్నారు. ఇది ఏమాత్రం ఆమోదనీయం కాదు’’అని ఎమ్మెల్యే వీరేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement