యువతలో పక్షవాతం ముప్పు  | Nearly 14 percent of patients with stroke in India are under 45 years of age | Sakshi
Sakshi News home page

యువతలో పక్షవాతం ముప్పు 

Feb 22 2026 6:11 AM | Updated on Feb 22 2026 6:11 AM

Nearly 14 percent of patients with stroke in India are under 45 years of age

45 ఏళ్లలోపు ప్రతి ఏడుగురిలో ఒకరు బాధితులు 

పక్షవాతానికి గురైన 24 గంటల తర్వాత ఆసుపత్రికి చేరుతున్న వారే ఎక్కువ 

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడైన విషయాలు  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పక్షవాతం బారిన పడుతున్న ప్రతి ఏడుగురిలో ఒకరు 45 ఏళ్లలోపు యువతేనని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. పక్షవాతం ఘటనల్లో అధిక రక్తపోటు అనేది ప్రధాన హేతువుగా పరిణమించిందని ఐసీఎంఆర్‌ అధ్యయనం పేర్కొంది. పక్షవాతం పడిన వారిలో మూడు నెలల్లోపే సగానికి పైగా రోగులు మరణించడం లేదా తీవ్రమైన అంగవైకల్యం బారినపడటం వంటివి జరుగుతున్నాయని సర్వే వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలు ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ స్ట్రోక్‌లో ప్రచురితమయ్యాయి.  

ఈ అధ్యయనం ప్రకారం.. 
→ 2020–2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 30 ఆసుపత్రుల్లో నమోదైన 34,792 పక్షవాతం కేసులను ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో రోగుల సగటు వయస్సు 59.4 సంవత్సరాలు కాగా, వీరిలో 45 ఏళ్లలోపు వారు 13.8 శాతం మంది ఉన్నారు. 

→ మొత్తం రోగుల్లో 63.4 శాతం మంది పురుషులుకాగా 72.1 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. 

→ రోగుల్లో 74.5 శాతం మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది.  

→ మొత్తం రోగుల్లో మధుమేహం బారినపడిన వాళ్లు 27.3 శాతం మంది, పొగాకు నమిలే అలవాటు ఉన్న వాళ్లు 28.5 శాతం మంది, ధూమపానం సేవించే వ్యక్తులు 22.6 శాతం మంది, మద్యపానం సేవించే అలవాటు ఉన్న వాళ్లు 20.2 శాతం మంది ఉన్నారు. మొత్తం రోగుల్లో మహిళలు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండగా పురుషుల్లో పొగాకు, మద్యపానం వినియోగం అత్యధికంగా ఉందని అధ్యయనంలో తేలింది. 

→ పక్షవాతం వచ్చిన వెంటనే తొలి 4–5 గంటలు అత్యంత కీలకం. అయితే కేవలం 20 శాతం మంది మాత్రమే ఆ సమయంలోపే ఆసుపత్రికి చేరుకుంటున్నారు. 

→ 37.8 శాతం మంది మాత్రం స్ట్రోక్‌ వచి్చన 24 గంటల తర్వాతే ఆస్పత్రిలో చికిత్స కోసం చేరుతున్నారు. దీంతో ఇలాంటి వారిలో మరణాల శాతం అత్యధికంగా ఉంటోంది. 

→ మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన(ఇస్కీమిక్‌) కేసులు మొత్తం కేసుల్లో 60 శాతం ఉన్నాయి. రక్తనాళాలు చిట్లిపోయిన(ఇంట్రాసెరెబ్రల్‌ హీమరేజ్‌) కేసులు 34.2 శాతం ఉన్నాయి. ఈ తరహా కేసుల్లో ఆసుపత్రిలో ఉండగానే 13.9 శాతం మంది మృతిచెందారు. 

→ మొత్తంగా సగానికి పైగా రోగులు మరణం లేదా తీవ్రమైన అంగవైకల్యంతో బాధపడుతున్నట్లు తేలింది. 

→ మహిళల్లో మరణాల కంటే అంగవైకల్యం కేసులు అధికంగా ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement