డాక్టర్ కావాలనుకుని.. దివ్యాంగుడయ్యాడు
జౌన్‌పూర్ (యూపీ): ‘నేను 2026లో ఎట్టి పరిస్థితు ల్లోనూ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి!’.. ఇది తన డైరీలో ఒక యువకుడు రాసుకున్న బలమైన నిశ్చయం. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను ఎంచుకున్న దారి చదివితే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వైద్య కళాశాలలో సీటు కోసం రిజర్వేషన్ పొందేందుకు ఒక విద్యార్థి తన కాలినే తెగ్గోసుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
వరుస వైఫల్యాలతో వికృత ఆలోచన!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్‌పూర్ జిల్లా ఖలీల్‌పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ (20) అనే యువకుడు రెండుసార్లు ‘నీట్’ పరీక్ష రాసినా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించలేకపోయాడు. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైన సూరజ్, ఎలాగైనా మెడికల్ సీటు కొట్టాలని భయంకరమైన ప్లాన్ వేశాడు. దివ్యాంగుల కోటా ఉంటే తక్కువ మార్కులకే సీటు వస్తుందని గ్రహించిన అతను, తన కాలిని స్వయంగా నరుక్కున్నాడు.
నేరస్తుల దాడి అంటూ ‘డ్రామా’!
ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తన తమ్ముడిపై దాడి చేసి, కాలు నరికేసి పారి పోయారని సూరజ్ అన్న పోలీసులకు ఫిర్యాదు చేయ డంతో కథ మొదలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. సూరజ్ మాటల్లో పొంతన లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది.
దర్యాప్తులో షాకింగ్ నిజాలు
పోలీసులు సూరజ్ ఫోన్‌ను, డైరీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్వహస్తాలతోనే కాలును వేరు చేసుకున్న సూరజ్, దానిని నేరస్తులపైకి నెట్టేందుకు ప్రయత్నించాడు. దివ్యాంగుల కోటా కింద మెడికల్ సీటు పొందడమే లక్ష్యంగా ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ యువకుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతనిపై ఏయే సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలో పోలీసులు న్యాయసలహా కోరుతున్నారు. మెడికల్ సీటు కోసం ఒక యువకుడు జీవితాంతం అంగవైకల్యంతో మిగిలిపోయే నిర్ణయం తీసుకోవడం.. అక్షరాలా ఒక సామాజిక అనారోగ్యానికి సంకేతం.


