చొరబాటుదారులను తొలుత ఓటర్ల జాబితా నుంచి తప్పిస్తాం
మార్చి 31కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తాం
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన
గువాహటి: దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను ఐదేళ్లలోపు దేశం నుంచి తరిమేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అస్సాంలోని రాష్ట్ర పోలీసుల 10వ బెటాలియన్ కోసం రూ.270 కోట్లతో నిర్మించతలపెట్టిన కొత్త ప్రాంగణానికి అమిత్ షా శంకుస్థాపనచేశారు. తర్వాత 87వ సీఆర్‌పీఎఫ్ డే పరేడ్‌లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ డే పరేడ్‌లో జరపడం ఇదే తొలిసారి.
‘‘అక్రమ వలసదారుల పేర్లు కేవలం ఓటర్ల జాబితాలో తీసేయడమేకాదు అసలు వాళ్లు దేశంలో ఉండకుండా చేస్తాం. అందరినీ స్వదేశాలకు సాగనంపుతాం. వచ్చే ఐదేళ్లలో దీనిని చేసి చూపిస్తాం. గిరిజనుల ప్రాంతంలో చొరబాటుదారుల దురాక్రమణ చెర నుంచి వందల ఎకరాల భూములకు విముక్తి కల్పించాం. అలా విముక్తి పొందిన ఈ 347 ఎకరాల భూమిలోనే కొత్త బెటాలియన్ క్యాంపస్‌ను నిర్మించుకోబోతున్నాం.
చొరబాటుదారులను ఏరిపారేస్తామని గతంలో రాహుల్‌గాంధీ పెద్ద ప్రతిజ్ఞలుచేశారు. అవన్నీ అబద్ధాలు. చొరబాటుదారులే కాంగ్రెస్ పారీ్టకి పెద్ద ఓటుగా తయారయ్యారు. చొరబాటుదారులను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ ఆందోళనలు చేస్తున్నారు. ఆరోపణల బాంబులు ఒకదానివెంట మరోటి విసురుతున్నారు. అవి కనీసం బాణా సంచా అంతటి స్థాయిలో అయినా పేలట్లేవు’’అని అమిత్ షా ఎద్దేవాచేశారు.
కీలకపాత్ర పోషించిన మన బలగాలు
‘‘జమ్మూకశీ్మర్‌లో సీఆర్‌పీఎఫ్ బలగాలు కీలకపాత్ర పోషించాయి. రాళ్లు రువ్వే ఘటనలు ఆగిపోయాయి. ఇక మణిపూర్‌లో జాతుల మధ్య విద్వేషం ఘటనలను తగ్గించడంలోనూ సీఆర్‌పీఎఫ్ అద్భుతంగా పనిచేసింది. కేవలం మూడేళ్లలో మావోయిస్టుల వెన్నువిరిచారు. 12 రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అసంఖ్యాక జిల్లాల్లో విస్తరించిన నక్సలిజంను సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు కూకటి వేళ్లతో పెకిలిస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్ బలం కారణంగానే మార్చి నెల 31వ తేదీకల్లా దేశం నుంచి నక్సలిజాన్ని శాశ్వతంగా సమూలంగా తుడిచేస్తానని చెప్పగల్గుతున్నా. సీఆర్‌పీఎఫ్ 86 ఏళ్ల చరిత్రలో సీఆర్‌పీఎఫ్ రైజింగ్–డే వేడుకలు ఈశాన్య రాష్ట్రాల్లో జరగడం ఇదే తొలిసారి. ఇది ప్రతి ఒక్కరు, దేశం గర్వించదగ్గ విషయం’’అని షా అన్నారు.


