మేడిన్‌ ఇండియా చిప్‌.. దేశాభివృద్ధికి అత్యంత కీలకం | PM Narendra Modi lays foundation stone of Foxconn-HCL chip plant in Jewar | Sakshi
Sakshi News home page

మేడిన్‌ ఇండియా చిప్‌.. దేశాభివృద్ధికి అత్యంత కీలకం

Feb 22 2026 4:17 AM | Updated on Feb 22 2026 4:53 AM

PM Narendra Modi lays foundation stone of Foxconn-HCL chip plant in Jewar

ప్రధాని మోదీ ఉద్ఘాటన 

ఉత్తర ప్రదేశ్‌లో హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్‌ ఉమ్మడి ఫ్యాక్టరీకి శంకుస్థాపన

గ్రేటర్‌ నోయిడా: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ వంటి స్వయం సమృద్ధి చర్యల ద్వారానే ‘అభివృద్ధి చెందిన భారత్‌’కు పునాదులు పడతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌లోని జెవార్‌లో దిగ్గజ సంస్థలు హెచ్‌సీఎల్‌ గ్రూప్, ఫాక్స్‌కాన్‌లు జాయింట్‌ వెంచర్‌ ద్వారా నిర్మించతలపెట్టిన ‘ఇండియా చిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’సెమీకండక్టర్ల తయారీ కర్మాగారానికి ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపనచేశారు.

 ‘‘కోవిడ్‌ మహాసంక్షోభ కాలంలో సూక్ష్మ చిప్‌ల సరఫరా గొలుసులు తెగిపోవడంతో పలు ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి స్తంభించిపోయింది. పలు ఫ్యాక్టరీల పనులు పూర్తిగా ఆగిపోయాయి. భారత్‌ ఆత్మనిర్భరత సాధించినప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరిస్తుంది. ఈ యజ్ఞంలో మేడిన ఇండియా చిఫ్‌ అనేది అత్యంత ముఖ్యం. ఈ దశాబ్దిలో సాంకేతికరంగంలో భారత్‌ ఏదైనా సాధిస్తుందో అదే 21వ శతాబ్దిలో మన శక్తిసామర్థ్యాలకు పునాదిగా మారుతుంది. 

చిప్‌లను దేశీయంగా తయారుచేసుకోవడం మొదలెడితే మన ఆధునిక పరికరాల తయారీ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. కోవిడ్‌ వేళ భారత్‌లోకి చిప్‌ల సరఫరా దారుణంగా దెబ్బతినడంతో ఇక్కడి కర్మాగారాల్లో ఉత్పత్తి కుంటుబడింది. ఆర్థికంగా సంస్థలు దెబ్బతిన్నాయి. ఈ సంక్షోభం నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకుంది. దీనిని సదవకాశంగా భావించింది. చిప్‌ తయారీలో స్వావలంభనే మన ధ్యేయం. అందుకే భారత్‌లో సెమీకండక్టర్ల తయారీరంగాన్ని ప్రోత్సహిస్తున్నాం’’అని మోదీ అన్నారు.

 ‘‘గ్రేటర్‌ నోయిడా సమీప జెవార్‌లో యమునా ఎక్స్‌ప్రెస్‌ ఇండిస్ట్రియలడెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ఔట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తున్నాం. ఇది ఉత్తరప్రదేశ్‌కు సాంకేతిక శక్తిగా కొత్త గుర్తింపును తీసుకొస్తుంది. యూపీ నుంచి ఎంపీగా గెలిచిన నాకు ఇది ఎంతో గర్వకారణం.  వచ్చే రెండేళ్లలో ఇండియాచిప్‌ ఫ్యాక్టరీలో డిస్‌ప్లే డ్రైవర్‌ చిప్‌ల ఉత్పత్తి మొదలవుతుంది. వచ్చే ఐదేళ్లలో రూ.3,700 కోట్ల పెట్టుబడులు ఈ కంపెనీలో పెట్టనున్నారు. కొత్త పెట్టుబడులతో 3,500కుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలొస్తాయి’’అని మోదీ అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement