ప్లేన్‌ క్రాష్‌పై దర్యాప్తుకు టీడీపీ బ్రేకులు | TDP puts brakes on investigation into plane crash | Sakshi
Sakshi News home page

ప్లేన్‌ క్రాష్‌పై దర్యాప్తుకు టీడీపీ బ్రేకులు

Feb 22 2026 4:23 AM | Updated on Feb 22 2026 4:23 AM

TDP puts brakes on investigation into plane crash

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి పట్ల అనేక అనుమానాలు

సమగ్ర ఆధారాలతో మీడియాకు వివరించిన ఎన్సీపీ నేత, ఎమ్మెల్యే రోహిత్‌ రాజేంద్ర పవార్‌  

విమానయాన సంస్థ వీఎస్‌ఆర్‌తో చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు సంబంధాలు

సాక్షి, న్యూఢిల్లీ: మహా­రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రమాదంలో మృతి పట్ల తమకు అనేక అనుమానాలున్నాయని, ఆయన ప్రయాణించిన విమా­నం వీఎస్‌ఆర్‌ కంపెనీతో టీడీపీ ముఖ్యులకు లోపాయికారీ ఒప్పందాలు, సంబంధాలు ఉన్నందునే దర్యాప్తు సవ్యంగా సాగడం లేదని ఎన్సీపీ (శరద్‌ పవార్‌) నేత, అజిత్‌ పవార్‌ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్‌ రాజేంద్ర పవార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్, వీఎస్‌ఆర్‌ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. 

ఈ రెండు కంపెనీల మధ్య వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరగబట్టే.. ప్రమాద ఘటన వ్యవహారంలో విచారణ పారదర్శకంగా సాగకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే విచారణ పూర్తి కాకుండానే వీఎస్‌ఆర్‌ కంపెనీ తప్పేమీ లేదని రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వీఎస్‌ఆర్‌ కంపెనీతో టీడీపీ పెద్దలకున్న ఆర్థిక లావాదేవీల కారణంగా విచారణ ప్రక్రియను రామ్మోహన్‌ నాయుడు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్ష­ణం ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని, లేదా రామ్మోహన్‌ స్వయంగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమా­దం జరిగిన తీరును, వీఎస్‌ఆర్‌ కంపెనీతో టీడీపీ ముఖ్యులకు ఉన్న బంధాన్ని వివరిస్తూ, రామ్మోహన్‌ నాయుడు వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు.  

హెరిటేజ్‌తో ఆర్థిక లావాదేవీలు
చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్, వీఎస్‌ఆర్‌ కంపెనీల మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయని రోహిత్‌ చెబుతూ.. ఈ రెండు కంపెనీల మధ్య 2023 మార్చి 30న జరిగిన ‘హైపోథిటికేషన్‌’ ఒప్పంద పత్రాన్ని చూపించారు. పక్కనే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, డాక్టర్‌ ఎం.సాంబశివరావు­ల ఫొటోలను చూపిస్తూ మీడియాకు వివరించారు. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం.. ముఖ్యంగా విమానాల కొనుగోలు అవసరాల కోసం అంటూ హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ సంస్థ నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుందని చెప్పారు. 

వీఎస్‌ఆర్‌ కంపెనీ వెనుక రాజకీయ, వ్యాపార వేత్తలు ఉన్నారని.. ఆ కంపెనీతో టీడీపీ అధినేతలకు, రామ్మోహన్‌నాయుడికి కూడా సంబంధాలు ఉన్నాయన్నారు. ‘ఓ పక్క ప్రమాదం జరిగి అందరూ శోక సంద్రంలో ఉంటే.. మరో పక్క వీఎస్‌ఆర్‌ కంపెనీ తప్పేమీ లేదని కేంద్ర మంత్రి పదవిలో ఉన్న రామ్మోహన్‌ ప్రకటించడం ఏమిటి? అంత త్వరగా ఆ కంపెనీకి వకాలత్‌ పుచ్చుకోవాల్సి­న అవసరం ఏమిటి? అసలు ప్రాథమిక రిపోర్టు రా­కుండానే బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి స్టేట్‌మెంట్లు ఇవ్వొచ్చా? ఏడాది క్రితం రాజ­స్తాన్‌లో జరిగిన కంపెనీ డైరెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ ఫంక్షన్‌కు టీడీపీలోని ప్రముఖ నేతలు హాజరు కావడంతో మాకు అనుమానాలొచ్చాయి. 

టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు, రామ్మోహన్‌ వీఎస్‌ఆర్‌ కంపెనీతో సన్నిహితంగా ఉండబట్టే.. అజిత్‌ పవార్‌ ప్రమాద ఘటనకు సంబంధించిన విచా­రణ ఇంకా పూర్తి కావ­డం లేదు. ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్‌ ఆ పదవిలో ఉంటే విచారణను పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నా­యి. తక్షణం కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్‌ను ఆ ప­దవి నుంచి తప్పించాలి. అజిత్‌ పవార్‌ మృతిపై మో­దీ, అమిత్‌షాలు న్యాయం చేయాలి’ అని కోరారు. 

హెరిటేజ్‌ నుంచి రూ.వందల కోట్లు
‘హెరిటేజ్‌ నుంచి వీఎస్‌ఆర్‌ కంపెనీకి రూ.200–­300 కోట్ల ఫండింగ్‌ వచ్చింది. అందుకే వీఎస్‌ఆర్‌ కంపెనీని టీడీపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ కాపాడుతున్నారు. విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని లోతుగా పరిశీలిస్తే పలు విషయాలు తెలిశాయి. ఈ క్రమంలో హెరిటేజ్‌కు, వీఎస్‌ఆర్‌కు మధ్య ఉన్న ఒప్పందం వెలుగులోకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎన్‌బీఎఫ్‌సీ (నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌)లో ఉన్నారు. 

మెజార్టీ షేర్‌ హోల్డర్లు వీళ్లవే ఉన్నాయి. వీళ్ల నుంచే వీఎస్‌ఆర్‌కు ఫండ్స్‌ వెళ్లాయి. వీళ్ల మధ్య ఇంతగా ఆర్థిక లావాదేవీలు ఉండబట్టే అజిత్‌ పవార్‌ ప్రమాద ఘటనపై విచారణ పారదర్శకంగా జరగట్లేదు. అందుకే రామ్మోహన్‌నాయుడిని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. 1,100 డిగ్రీల వేడిలో ఉన్నా బ్లాక్‌ బాక్స్‌ కాలిపోవడం జరగదు. 

కానీ ఈ ఘటనలో బ్లాక్‌ బాక్స్‌ కాలిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. టీడీపీకి చెందిన కీలక వ్యక్తి రూ.650 కోట్లతో దుబాయిలో వీఎస్‌ఆర్‌ కంపెనీ ద్వారా విమానం కొనుగోలు చేశాడు. ఇలా ఒకటి, రెండు విషయాలు కాదు.. చాలా ఆర్థికపరమైన వ్యవహారాలు టీడీపీ నేతలు, వీఎస్‌ఆర్‌ కంపెనీకి మధ్య ఉన్నాయి’ అని రోహిత్‌ పవార్‌ చెప్పారు.

కుట్ర కోణంలో దర్యాప్తు జరగాలి
ప్రమాదం జరిగిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు జరిగాయని రోహిత్‌ పవార్‌ తెలిపారు. వీఎస్‌ఆర్‌ కంపెనీ వెనుక రాజకీయ పార్టీల నేతలు, వ్యాపార వేత్తలు ఉండటం వల్లే ఆ కంపెనీకి కొమ్ముకాస్తున్నట్లు చెప్పారు. ‘డీజీసీఏలో కొంత మంది అధికారులు వీఎస్‌ఆర్‌ కంపెనీతో కుమ్మక్కయ్యారు. అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం దుర్మరణం చెందినా.. కంపెనీ యజమాని వీకే సింగ్‌ను అరెస్టు చేయలేదు. దీని వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్‌ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. 

వీఎస్‌ఆర్‌ పైలెట్‌ కపూర్‌ లైసెన్స్‌పై కూడా అనుమానాలు ఉన్నాయి. పైలెట్‌ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. పైలెట్లకు 12 గంటల విశ్రాంతి ఇవ్వాలన్న నిబంధనలకు వీఎస్‌ఆర్‌ తూట్లు పొడిచింది. రూ.35 కోట్లు విలువ గల విమానానికి రూ.265 కోట్లు (ఈ విమానం ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.10–15 కోట్లే. అయితే ఏకంగా రూ.55 కోట్ల ఇన్సూ్యరెన్స్, రూ.210 కోట్ల లయబిలిటీ ఇన్సూ్యరెన్స్‌) ఇన్సూ్యరెన్స్‌ చేశారు. దీనిపై అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. అనుమతి లేని కంపెనీకి చెందిన బ్లాక్‌ బాక్స్‌ను ఈ విమానంలో వినియోగించారు. 

బ్లాక్‌ బాక్స్‌ కాలిపోయిందని చెప్పడం చూస్తుంటే మరిన్ని అనుమానాలకు ఆజ్యం పోసినట్లు అవుతోంది. టాయిలెట్‌ వెనుక లగేజ్‌ పెట్టే ప్రాంతంలో కొన్ని పెట్రోల్‌ క్యాన్‌లను ఉంచారు. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యూయల్‌ నింపారు. అందుకే ఎక్కువ పేలుళ్లు జరిగాయి. ఒక క్రికెటర్‌ వీఎస్‌ఆర్‌ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్‌లో తీవ్రమైన సమస్య వచ్చింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. వీఎస్‌ఆర్‌ విమాన జీవిత కాలం 5 వేల గంటలు మాత్రమే. 

ప్రమాదం జరిగిన సమయానికి 85 గంటలు మాత్రమే మిగిలి ఉంది. డీజీసీఏ అధికారులను ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వీఎస్‌ఆర్‌ కంపెనీకి ఉన్నాయి. అందుకే క్యాబిన్‌ క్రూ సిబ్బందిని ప్యాసింజర్‌లా చూపించారు. ఈ ప్రమాదంపై కుట్ర కోణంలోనూ విచారణ జరగాలి’ అని అన్నారు. తక్షణం రామ్మోహన్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.  

రూ.10 కోట్ల నుంచి రూ.500 కోట్లకు.. 
అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం వెనుక రాజకీయ, కమర్షియల్‌ కుట్ర ఉంది. వీఎస్‌ఆర్‌ కంపెనీతో డీజీసీఏ అధికారి, కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు మంచి సంబంధాలున్నాయి. అందుకే ఆ కంపెనీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ప్రమాదాలు, అవకతవకలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. ప్లేన్‌ క్రాష్‌ ఘటన కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజాలను సమాధి చేస్తున్నారు. 

కంపెనీ డైరెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ను పట్టుకోకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అసలు రోహిత్‌ సింగ్‌కు డీజీసీఏ ఎందుకు మద్దతిస్తోంది? రామ్మోహన్‌ నాయుడు మంత్రి పదవిలో ఉంటే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు. 2016లో రూ.10 కోట్ల కంపెనీ 2025లో రూ.500 కోట్లకు చేరింది.  

రామ్మోహన్‌ నాయుడిని పదవి నుంచి తప్పించండి 
బారామతి విమాన ప్రమాదంపై ప్రధానికి రోహిత్‌ పవార్‌ లేఖ  
ముంబై: బారామతి విమాన ప్రమాదంపై విచారణ పూర్తయ్యే వరకు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడును  పదవి నుంచి తప్పించాలని   డిమాండ్‌ చేస్తూ రోహిత్‌ పవార్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.విమాన ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని, వీటిని స్వతంత్ర సంస్థతో దర్యాప్లు జరిపించి నివృత్తి చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement