వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసుకుందాం
భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు
లూలా డా సిల్వా నిర్ణయం
అరుదైన ఖనిజాల్లో సహకారానికి ఒప్పందంపై సంతకాలు
అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమన్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 30 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్, బ్రెజిల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అరుదైన ఖనిజాల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికొచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు.
రక్షణ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు తదితర కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్–బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అభిప్రాయాలు పంచుకున్నారు.
ఉగ్రవాదం విషయంలో భారత్, బ్రెజిల్ దేశాలది ఒకేమాట అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద పోషకులు మానవాళికి అతిపెద్ద శత్రువులు అని తేల్చిచెప్పారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు పరిష్కారం కావాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరం అని పునరుద్ఘాటించారు. సంస్కరణలకు భారత్, బ్రెజిల్ మద్దతిస్తున్నాయని తెలిపారు.
లూలా డా సిల్వాతో భేటీ అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. లాటిన్ అమెరికాలో భారత్‌కు బ్రెజిల్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని గుర్తుచేశారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం అంటే కేవలం అంకెలు కాదని.. విశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. భారత్, బ్రెజిల్ మధ్య మొత్తం తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
ఇరుపక్షాలూ లాభపడే భాగస్వామ్యం
భారత్, బ్రెజిల్ మధ్య దశాబ్దాలుగా వాణిజ్య బంధం కొనసాగుతోంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ నుంచి బ్రెజిల్‌కు ఎగుమతుల విలువ 6.77 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 5.43 బిలియన్ డాలర్లు. అరుదైన ఖనిజాల విషయంలో సహకారానికి బ్రెజిల్‌తో ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ వెల్లడించారు. సుస్థిరమైన సప్లై చైన్స్ నిర్మించడానికి ఇదొక కీలకమైన చర్యగా అభివరి్ణంచారు.
డిజిటల్ భాగస్వామ్యంపై భారత్, బ్రెజిల్ ఒక ఉమ్మడి డిక్లరేషన్‌ను ఆమోదించాయి. మైనింగ్, ఎంఎస్‌ఎంఈ, ఆరోగ్య సంరక్షణ, సంప్రదాయ విజ్ఞానంపై ఒక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో భారత్–బ్రెజిల్ భాగస్వామ్యం కొనసాగుతూనే ఉంటుందని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక సహకారానికి ఇదొక గొప్ప ప్రతీక అని వెల్లడించారు.
ఇరుపక్షాలూ లాభపడే భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. భారత్–బ్రెజిల్ ఒక్కటైతే గ్లోబల్ సౌత్ గొంతుక మరింత బలం పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశాలుగా కలిసికట్టుగా పనిచేస్తూ గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఏ సమస్యనైనా సరే చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు.
భారత్, బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను లూలా డా సిల్వా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క మతంతో గానీ, జాతితో గానీ ముడిపెట్టొద్దని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ పరిణామాలు అందోళన కలిగిస్తున్నాయని, ఈ తరుణంలో భారత్–బ్రెజిల్ మధ్య సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరగాలని స్పష్టంచేశారు. గ్లోబల్ సౌత్‌లో భారత్, బ్రెజిల్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని తెలిపారు.
రెండు దేశాలు డిజిటల్ సూపర్ పవర్‌గా, పునరుత్పాదక ఇంధన రంగంలో సూపర్ పవర్‌గా మారాయని వెల్లడించారు. సంఘర్షణ కొనసాగుతున్న తరుణంలో సుస్థిరాభివృద్ధి, శాంతి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. 20వ శతాబ్దపు టైప్‌రైటర్లపై 21వ శతాబ్దపు సాఫ్ట్‌వేర్‌ను నడిపించలేమంటూ గత ఏడాది బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సిల్వా గుర్తుచేశారు.
ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అత్యంత కీలకమని చెప్పారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్, బ్రెజిల్‌కు సహజంగానే హక్కు ఉందని స్పష్టంచేశారు. గ్లోబల్ సౌత్ గొంతుకు బలంగా వినిపించాలంటే రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు.


