కర్నూలు(హాస్పిటల్): మూతి వంకర పోవడం, అ లాంటి నోటి నుంచి నీరు కారుతుండటం, తినాలన్నా, తాగాలన్నా ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే దానిని వైద్యపరిభాషలో బెల్స్ పాల్సీ అంటారు. తెలుగులో దానిని ముఖ పక్షవాతమని పిలుస్తారు. శీతాకాలంలో ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువవుతాయి. శీతల గాలుల నుంచి రక్షణ పొందడమే ఈ సమస్య రాకుండా నివారించే చర్య అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో చలిగాలులు తీవ్రమయ్యాయి.
రాత్రి పూటే కాదు పగలు కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. ఈ కారణంగా ఇల్లు, కార్యాలయం ఏదైనా, ఎక్కడైనా ఫ్యాన్ వేయాలన్నా జంకుతున్నారు. విపరీతమైన చలి ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. చలికారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగలు 20 డిగ్రీల సెల్సియస్‌కు, రాత్రి 13 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతున్నాయి. చాలా మందికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా చల్లగాలికి బయటకు వెళ్లాల్సి ఉంటోంది. మరికొందరు ఉదయం వేళల్లో వాకింగ్‌కు వెళ్తుంటారు.
ఇలా చల్లగా ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చెవుల్లో నుంచి చల్లగాలి లోపలికి వెళ్లి ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి, జనరల్ మెడిసిన్, క్యాజువాలిటీ విభాగాలకు ప్రతి వారం ముగ్గురు నుంచి నలుగురు ముఖ పక్షవాతానికి (బెల్స్‌పాల్సీ) గురై చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు సైతం రోజూ 6 నుంచి 8 మంది వరకు న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు చికిత్సకు వెళ్తున్నారు.
కారణాలు
బెల్స్‌పాల్సీకి కచ్చితమైన కారణం ఉండదు. దీనికి అనేక వైరస్‌లు కారణమవుతాయి. వీటిలో హెర్పస్ సింప్లెక్స్, హెర్పెస్ జోస్టర్, హెచ్‌ఐవీ, సైటోమెగలోవైరస్, ఎప్సీ›టన్ బార్ వైరస్‌లు ప్రధానమైనవి. మధుమేహం, గర్భిణులు, గాయం, వాపు, ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. చలివాతావరణంలో ఈ వైరస్‌లు మనుగడు ఎక్కువగా సాగిస్తాయి కాబట్టి అధిక శాతం వీటి ప్రభావానికి గురవుతుంటారు. వీరు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.
బెల్స్ పాల్సీ అంటే...!
బెల్స్ పాల్సీ (ముఖపక్షవాతం) అనేది ముఖంలోని నరాలకు హాని కలిగించే ఒక రకమైన ఆరోగ్య సమస్య. తద్వారా రోగి ముఖ కదలికలను వ్యక్తం చేయడం, తినడం, మాట్లాడటం వంటివి చేయలేడు.
లక్షణాలు
⇒ కనురెప్పలు మూసివేయడం, రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు
⇒ ముఖం కదిలించడంలో ఇబ్బంది
⇒ నోరు ఒకవైపునకు వాలిపోవడం
⇒ ముఖ ఆకృతులను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు
⇒ బెల్స్ పాల్సీలో వ్యక్తి తన కనుబొమ్మలను ఎగురవేయలేడు
⇒ మాట్లాడటం, తినడంలో ఇబ్బంది
చలిలో తిరిగితే ఈ సమస్య
గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉంటోంది. చలిగాలులు పగలు సైతం అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెవులకు అచ్ఛాదన లేకుండా బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే చల్లటి వాతావరణంలో వైరస్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి నరాలపై దాడి చేస్తాయి. దీనినే న్యూరోట్రోపిక్ అటాక్స్ అంటాము. అధిక శాతం వైరస్‌ల వల్ల బెల్స్ పాల్సీ వస్తుంది. కొందరిలో ఎలాంటి కారణం లేకుండా వస్తుంది. ఇలాంటి వారికి అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తాము.
– డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి హెచ్‌ఓడీ, జీజీహెచ్, కర్నూలు


