‘బాహుబలి’ రాకెట్ ద్వారా అమెరికా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కీలకమైన వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన బ్లూబర్డ్–6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈనెల 21న ప్రయోగించబోతోంది. ఇస్రో రూపొందించిన బాహుబలి (ఎల్‌వీఎం3–ఎం6) రాకెట్ ద్వారా దీనిని నిర్వహించనుంది. అక్టోబర్ 19వ తేదీనే అమెరికా నుంచి ఈ ఉపగ్రహం షార్‌కు చేరుకుంది. ఈ ప్రయోగాన్ని గత నెలలో నిర్వహించాల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వచ్చింది.
అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. గతంలో పంపిన బ్లూబర్డ్ ఉపగ్రహాల కన్నా.. 10 రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పని చేసేలా దీనిని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికాల మధ్య ఇది రెండో అతిపెద్ద సహకారం.
జూలైలో ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని.. ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 31న పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగాన్ని నిర్వహించేందుకు కూడా ఇస్రో చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది.


