- శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా అనుచరుల గూండాగిరి
- తలనీలాల టెండర్‌లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై దాడి
- మా ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాతే రావాలని బెదిరింపులు
- వేలంలో పాల్గొనకుండానే పరుగులు తీసిన కాంట్రాక్టర్లు
- ఈ నెల 11న ఘటన... ఆలస్యంగా వెలుగులోకి..
- దేవదాయశాఖ కమిషనర్‌కు కాంట్రాక్టర్ల ఫిర్యాదు?
- అర్ధంతరంగా టెండర్ రద్దు
సాక్షి, నంద్యాల/సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఇటీవల అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన మరువకముందే... ఆయన అనుచరులు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలంలో కాంట్రాక్టర్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. పరమేశ్వరుడి సన్నిధిలో భక్తులు సమర్పించిన తలనీలాలు పోగుచేసుకునే కాంట్రాక్టు కోసం టెండర్‌లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను తరిమికొట్టారు. ‘మా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకున్నాకే రండి..’ అంటూ బెదిరించి వెనక్కి పంపినట్లు సమాచారం. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేవస్థానం ఆఫీసు లోపలికి రాకుండానే బెదిరింపులు!
శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దేవస్థానంలో తలనీలాలు పోగు చేసుకునే హక్కును గత సంవత్సరం రూ.4.89 కోట్లకు అనంతపురానికి చెందిన రాజా ఎంటర్‌ప్రైజెస్ పొందింది. వారి కాలపరిమితి పూర్తవడంతో ఒక ఏడాదికి సుమారు రూ.5కోట్ల అంచనాలతో టెండర్ కమ్ బహిరంగ వేలం కోసం దేవస్థానం నెల రోజుల కిందట టెండర్లు ఆహ్వానించింది. కొద్దిరోజుల కిందట బహిరంగ వేలంపాటకు అన్నీ సిద్ధం చేసినా దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో స్థానికంగా లేకపోవడంతో వాయిదా వేశారు.
ఈ నెల 11న రెండోసారి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి పలువురు కాంట్రాక్టర్లు రూ.50లక్షలు చొప్పున డీడీలు తీసుకుని బహిరంగ వేలంలో పాల్గొనేందుకు దేవస్థాన పరిపాలన భవనం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంటకు చెందిన కొందరు ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు కాపు కాసి కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు.
అయినా కొందరు కాంట్రాక్టర్లు వారి నుంచి తప్పించుకుని ఆఫీసు లోపలికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు లోపలికివెళ్లి కాంట్రాక్టర్లపై దాడి చేశారు. ‘మా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకుని రమ్మంటే ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు..’ అంటూ కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతున్న కాంట్రాక్టర్లను వెంటపడి రక్తం వచ్చేలా కొట్టినట్లు తెలిసింది.
కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే అనుచరుల దాడి దృశ్యాలను ఓ కాంట్రాక్టర్ డ్రైవర్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా, టీడీపీ నాయకులు అతడిపైనా దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుల గూండాగిరితో భక్తులు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది భయభ్రాంతులకు గురైనట్లు తెలిసింది.
దాడి చేస్తారని పోలీసులకు ముందుగా తెలిసినా..!
తలనీలాల టెండర్‌లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సిబ్బంది ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దేవస్థాన పరిపాలన భవనానికి పోలీసులు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేరుకున్నారు. అయినా వారి సమక్షంలోనే టీడీపీ మూకలు రెచ్చిపోయి కాంట్రాక్టర్లపై దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
కమిషనర్‌కు కాంట్రాక్టర్ల ఫిర్యాదు.. టెండర్ రద్దు
తలనీలాల టెండర్‌లో పాల్గొనకుండా తమపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు దాడి చేశారని కాంట్రాక్టర్లు వెంటనే రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. తమపై దాడి గురించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంట్రాక్టర్లు కోరినట్లు సమాచారం.
అసలు టెండర్‌తో సంబంధం లేని వ్యక్తులు దేవస్థాన పరిపాలన భవనం వద్దకు ఎలా వచ్చారు? వారిని ఎవరు పంపించారు? ఎవరు అనుమతించారు? వంటి విషయాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దేవస్థాన పరిపాలన భవనం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే తమపై దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పినట్లు సమాచారం.
టెండర్ ధర తగ్గించేందుకు ఎమ్మెల్యే కుట్ర?
కాంట్రాక్టర్లను బెదిరించి బహిరంగ వేలంలో పాల్గొనకుండా చేయాలని, తద్వారా తక్కువ ధరకు తలనీలాల కాంట్రాక్టును తాను సూచించినవారికి దక్కేలా చేయాలని ఎమ్మెల్యే కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తన అనుచరులతో కాంట్రాక్టర్లను బెదిరించి కొందరిని సిండికేట్‌గా ఏర్పాటుచేసి గత ఏడాది కన్నా తక్కువ ధరకు టెండర్ వేసేలా చక్రం తిప్పుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా దేవస్థానానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని తాను పొందేలా పథకం రచించారని ప్రచారం జరుగుతోంది.


