నెల్లూరు మేయర్ పదవిని వదులుకున్న స్రవంతి
నెల్లూరు నగరపాలక సంస్థ అత్యున్నత పీఠంపై గిరిజన మహిళను కూర్చోబెట్టిన జగన్
బాబు ప్రభుత్వం రాగానే మేయర్ పీఠంపై కన్ను
అధికార పార్టీలోకి రావడానికి అంగీకరించని మేయర్
ఆమె, ఆమె కుటుంబాన్ని వేధించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
అడిగిన చోట సంతకాలు పెట్టలేదని అక్కసు
మేయర్ భర్తపై అక్రమ కేసులు, జైలుపాలు
తమ అవినీతి, అక్రమాలకు మేయర్ అడ్డుగా ఉందనే అవిశ్వాసానికి తెగింపు
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు, అక్రమ కేసులు
మహిళా కార్పొరేటర్లకు వేధింపులపై చలించిన మేయర్
తన రాజీనామాతో కార్పొరేటర్లకు విముక్తి లభిస్తుందని ఆశాభావం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాల తర్వాత గిరిజన మహిళకు దక్కిన రాజ్యాధికారాన్ని చంద్రబాబు చిదిమేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నత పదవి అయిన మేయర్‌గా ఓ గిరిజన మహిళకు అవకాశం కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు నేతలు అనేకానేక కుట్రలకు పాల్పడి, మేయర్‌ను, ఆమె కుటుంబ సభ్యులను, కార్పొరేటర్లను పైశాచికంగా వేధించి, చివరకు ఆ పదవి నుంచి గిరిజన మహిళా మేయర్‌ను తప్పించారు.
ఇందుకోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వికృత రాజకీయం రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. నాలుగేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన మహిళ అయిన పోట్లూరు స్రవంతిని అత్యున్నతమైన మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నెల్లూరు నగర పాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాలన సాగించారు.
బాబు ప్రభుత్వం రాగానే కుట్ర
చంద్రబాబు ప్రభుత్వం రాగానే మేయర్ పదవిని చేతిలోకి తీసుకొని, దోపిడీ చేయాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుట్ర పన్నారు. నగర మేయర్‌ను అధికార పార్టీలోకి తీసుకోవాలని ప్రయతి్నంచారు. అధికార పార్టీలోకి రాలేదన్న కారణంతో పాటు తాము చెప్పిన చోట సంతకాలు చేయలేదన్న అక్కసుతో మేయర్ కుటుంబాన్ని అష్టకష్టాలు పెట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పూర్తి కాలం పదవిలో కొనసాగనీయకుండానే ఆమెను పదవి నుంచి దింపేసి, మంత్రి నారాయణకు అనుకూలుడైన కార్పొరేటర్‌కు ఆ పదవి కట్టబెట్టేందుకు కుట్రలకు తెగబడ్డారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు.
మేయర్ పీఠంపై డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌ను కూర్చోబెట్టేందుకు కార్పొరేటర్లకు తాయిలాలు ఎరవేశారు. కార్పొరేటర్లు లొంగకపోవడంతో వేధింపులు, అరాచకాలకు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బెదిరించి 40 మందికి పైగా కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడంతో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉండాల్సి వచ్చింది. అధికార పార్టీ చెప్పిన విధంగా ఉండాలని రాయబేరాలు చేసినా మేయర్ ససేమీరా అనడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
18 నెలలుగా ఆమెను, ఆమె కుటుంబాన్ని రౌడీమూకలతో బెదిరించారు. కార్పొరేషన్ పరిధిలో భవనాల మార్టిగేజ్ విషయంలో ఫోర్జరీ సంతకాలు చేశారని, కార్పొరేషన్ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేశారంటూ పలు అక్రమ కేసులతో మేయర్ భర్త జయవర్దన్‌ను జైలుపాలు చేశారు. మేయర్‌ను సోషల్ మీడియాలో మానసికంగా వేధించారు. కార్పొరేషన్‌లో మేయర్‌కు దక్కాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మేయర్ అన్నింటినీ భరిస్తూ వచ్చారు. చివరకు ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించారు.
అవిశ్వాసానికి సహకరించాలని కార్పొరేటర్లపైనా వేధింపులు, బెదిరింపులు మితిమీరాయి. తమకు మద్దతు పలకని కార్పొరేటర్లను పోలీసులతో కిడ్నాప్ చేయించి క్యాంపు రాజకీయాలకు దిగారు. కార్పొరేటర్లకు తాయిలాలు ప్రకటించి తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న తరుణంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ టీడీపీలోకి ఫిరాయించిన ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్‌సీపీలో చేర్పించి, ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామాలతో టీడీపీ గంగవెర్రులెత్తిపోయింది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది.
ఒక్కో కార్పొరేటర్‌కు రూ.40 లక్షలు ఇచ్చి క్యాంపులకు తరలించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను సైతం తాయిలాలతో పాటు అక్రమ కేసులతో బెదిరించి టీడీపీ కండువా కప్పారు. వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్లను కూడా అసభ్య పదజాలాలతో బెదిరించారు. వారి కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. దీంతో మేయర్ స్రవంతి తన వల్ల మహిళా కార్పొరేటర్‌లు పడుతున్న బాధకు చలించి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


