కుమార్తె డ్రగ్స్‌కు అలవాటు పడిందని తల్లి ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలింపు
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువకుల ద్వారా బాలికకు డ్రగ్స్ అందుతున్నట్టు సమాచారం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్‌కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని ఒక టీవీ చానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్‌కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు
మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్‌కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు.
బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు.
కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు.


