పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ట్‌ అరెస్ట్‌ | YSRCP Leaders House Arrest In Guntur And Palnadu Ahead Of Pinnelli Brothers Court Surrender | Sakshi
Sakshi News home page

పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ట్‌ అరెస్ట్‌

Dec 11 2025 10:38 AM | Updated on Dec 11 2025 11:22 AM

YSRCP Leaders House Arrest In Guntur And Palnadu

సాక్షి, పల్నాడు జిల్లా: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పిన్నెల్లిని కలవడానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పార్టీ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్‌ చేయడంతో పాటుగా మాచర్లకు ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు.

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నేడు మాచర్ల జూనియర్‌ అదనపు సివిల్‌ జడ్జి కోర్టులో లొంగిపోనున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. ఈ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడంతో కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తెలుగుదేశం నాయకులు ఆధిపత్య పోరులో ఇద్దరిని మర్డర్ చేస్తే మాపైన అక్రమంగా కేసు పెట్టారు. ఈరోజు కోర్టులో మేము సరెండర్ అవుతాము. మా ఇంటికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు చుట్టూ బారికేడ్లు పెట్టారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కనీసం మా బంధువులను కూడా మా ఇంటికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయటం దారుణం’ అని అన్నారు.

మరోవైపు.. మీడియాపైన కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంటికి మీడియా వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఆయన ఇంటికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. మాచర్లకు బయట వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా పంపించి వేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్‌లో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్‌-30ని పోలీసులు అమలు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement