పయ్యావుల ఆర్థిక మంత్రి కాదు.. అప్పుల మంత్రి: పేర్ని నాని | Perni Nani Slams Chandrababu Government Debts | Sakshi
Sakshi News home page

పయ్యావుల ఆర్థిక మంత్రి కాదు.. అప్పుల మంత్రి: పేర్ని నాని

Mar 13 2026 6:10 PM | Updated on Mar 13 2026 7:22 PM

Perni Nani Slams Chandrababu Government Debts

సాక్షి, తాడేపల్లి: పయ్యావుల కేశవ్‌ ఆర్థిక మంత్రి కాదు.. అప్పుల మంత్రి.. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్దాలేనంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలపై మీ దగ్గర సమాధానం ఉందా?. డాక్యుమెంట్‌ ఎవిడెన్స్‌తో వైఎస్‌ జగన్‌ నిజాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క విషయమైన అబద్ధమని మీరు నిరూపించుగలరా?’’ అంటూ పేర్ని నాని సవాల్‌ విసిరారు.

‘‘ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను చెర పట్టి మోసం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది?. మహిళలను వేధిస్తే అదే చివరి చూపు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ఐదుసార్లు అబార్షన్ చేయించిన ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకున్నారు?. చివరకు ఆ బాధితురాలి మీదే కేసు పెట్టారు. ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సంతకం చేయించి అప్పులపై డాక్యుమెంట్ రిలీజ్ చేసే దమ్ముందా?. ఆలీ బాబా 24 మంది దొంగలు అబద్దాలతో బతికేస్తున్నారు. ఏ సంవత్సరం కాగ్ నివేదికలను చూసినా ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది

..ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కాగ్ నివేదికలు చూసి మాట్లాడితే మంచిది. ఇప్పటికే రూ.3.27 లక్షల కోట్ల అప్పు చేసినట్టు జీవోలు ఉన్నాయి. మరి కేవలం లక్ష కోట్లేనని పచ్చి అబద్దాలు ఎలా చెబుతారు?. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వారం సమయం ఇస్తున్నాం. ఈ లెక్కలపై వాస్తవమో కాదో చెప్పే దమ్ముందా?. ఆర్థిక శాఖ తప్పుడు లెక్కలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. హెరిటేజ్ డెయిరీలో అప్‌గ్రేడ్ చేస్తున్నందున టైలర్ మేడ్ ఇన్సెంటీవ్స్ ఇవ్వాలంట. రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తారట. దానివలన‌ 35 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయట

..2014-19 మధ్యలో మజ్జిగ కోసం కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చారు. 2 వేల కేజీల పాలపొడిని హెరిటేజ్ నుండి టీటీడీ కోసం కొన్నారు. ఏ ఆలయానికీ హెరిటేజ్ ఉత్పత్తులు సరఫరా చేయలేదన్న చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెప్తారు?. ఇందాపూర్-హెరిటేజ్, సంగం-వైష్ణవి మధ్య లింకేంటి?. హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయని.. బీఆర్ నాయుడు వీడియోలను బయటకు వదిలారు. అక్రమ సంబంధాల బీఆర్ నాయుడుకి అసలు టీటీడీ ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?. రైతులు కష్టాలు పడుతుంటే హెరిటేజ్‌కి మాత్రం కరెంటు బిల్లులో కూడా రాయితీ ఇస్తారట

ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని

..400 శాతం పనీరు తయారీని పెంచటానికి రాయితీలు ఇవ్వాలట. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో పిల్లలకు మంచి భోజనం కూడా పెట్టలేరా?. ప్రతిరోజూ అనేకచోట్ల జరుగుతున్నా మంత్రి లోకేష్ ఎందుకు పట్టటం లేదు?. ప్రత్యేక విమానాల్లో సముద్రాలు దాటి వెళ్లి మరీ క్రికెట్ చూస్తున్న మంత్రికి పిల్లల కష్టాలు కనపడటం లేదా?. ఆ విమానాల ఖర్చు ఏ ఖాతా నుండి పెడుతున్నారో ఎందుకు చెప్పటం లేదు?. మైలవరం తారకరామ స్కూల్‌లో భోజనం గురించి హెచ్.ఎం చాలాసార్లు డీఈవోకు చెప్పారు. అయినా పట్టించుకోలేదు. పోలీసు అధికారి వెళ్తే పిల్లలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి లోకేష్ తన పదవిని వేరే వారికి అప్పగిస్తే మంచిది’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement