‘నా దాహం తీరనిది.. నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు’ | TDP Senior Leader Vadde Sobhanadreeswara Rao Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘నా దాహం తీరనిది.. నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు’

Mar 13 2026 6:26 PM | Updated on Mar 13 2026 7:16 PM

TDP Senior Leader Vadde Sobhanadreeswara Rao Slams Chandrababu

విజయవాడ:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. భూదాహం తప్పితే ఇంకోటి లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత వడ్డే శోభానాధ్రీశ్వరరావు  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రభుత్వంలో చాలా వేగంగా రైతుల నుంచి భూములు లాక్కొంటున్నారని ధ్వజమెత్తారు. చట్టంతో పనిలేకుండా అనుకున్నదే తడువగా ముందుకు అడుగులు వేస్తున్నారని విమర్శించారు.  ‘‘నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని’’ అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని వడ్డే శోభానాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు.

‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి లాక్కున భూములను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారు.  వేల ఎకరాల భూమిని తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చే చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైన చర్య. పేదల పొట్టకొట్టి వారి నోటి వద్ద కూడు తీసి బడా కంపెనీలకు ఇచ్చే ఆలోచన చంద్రబాబు చేయడం తగదు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనను విరమించుకోవాలి. అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. 

ఏపీ ప్రభుత్వం 26 లక్షల ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం కేటాయించే ప్రణాళికను రూపొందించింది. ఇది చట్ట విరుద్ధం , రాజ్యాంగ విరుద్ధం. నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు స్వార్ధపూరిత ఆలోచనలను మానుకోవాలి. ఏపీలో ప్రతీ ఇంటిమీద , ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానల్స్ పెట్టండి. కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయండి. లేకపోతే చంద్రబాబు భూ బకాసురుడు అనే నింద మోయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement