సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్‌మెంట్‌గా ఉంటూ, మానసిక శాస్త్రం ప్రకారం నేర్చుకొనేవారికి, చదువు చెప్పే వారికి విశ్రాంతి అవసరమని, కానీ దానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖను అత్యవసర శాఖగా మార్చేశారని యూటీఎఫ్ ఆక్షేపించింది. ఉపాధ్యాయులను వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈమేరకు ఆదివారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖను నాన్ వెకేషన్ శాఖగా మార్చమని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ కమిషనర్‌కు గతంలో విన్నవిస్తే సాధ్యం కాదని సమాధానం ఇచ్చారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీం పేరుతో ఒత్తిడి చేస్తూ శని, ఆదివారాలు, పండుగ సెలవులలో పని చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారని విమర్శించారు. 100% ఉత్తీర్ణత పేరుతో ప్రతిరోజు సాయంత్రం పరీక్ష నిర్వహించి మార్కులు అప్‌లోడ్ చేయాలని ఒత్తిడి చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గంజాయికి బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలి
విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారి జీవితాలను బలిచేసుకుంటున్న ఘటనలపై యూటీఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గంజాయిని విక్రయించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు.


