పండుగ అమ్మకాల్లో అమెరికాను అధిగమించిన వైనం
దసరా–దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ ద్వారా రూ.1.24 లక్షల కోట్ల సేల్స్
ఇది అమెరికాలో అత్యధికంగా జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్స్ కంటే ఎక్కువ
2024లో అమెరికా బ్లాక్ ఫ్రైడే సేల్స్ రూ.95,040 కోట్లు మాత్రమే
ఈ ఏడాది రూ.1,02,960 కోట్ల విక్రయాలు ఉండవచ్చని అంచనా
ఇండియా ఆన్‌లైన్ అమ్మకాల్లో అత్యధికంగా ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలే
ఆ తర్వాత స్థానాల్లో మొబైల్స్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ఆన్‌లైన్ అమ్మకాల్లో భారత్ దూసుకుపోతోంది. టెక్నాలజీ వినియోగంలో ముందుండే అమెరికాను దాటేసి భారతీయులు ఆన్లైన్లో వారికి నచ్చిన వస్తువులను కొనేస్తున్నారు. మన దేశంలో అత్యధికంగా అమ్మకాలు జరిగే దసరా–దీపావళి పండుగ సమయంలో జరిగిన అమ్మకాలు.. అమెరికాలో క్రిస్మస్ ముందు జరిగే బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను మించిపోయాయని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ సంవత్సరం పండుగల సీజన్‌లో రూ.1.24 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు ఎస్‌బీఐ అంచనా వేసింది.
ఇది గతేడాది జరిగిన అమ్మకాలు రూ.94,800 కంటే ఎక్కువ. పండుగల సీజన్‌కు ముందు కేంద్రప్రభుత్వం జీఎస్టీ రేట్లను సంస్కరించడం ఈ ఏడాది అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ఇదే సమయంలో అమెరికాలో ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు రూ.1,02,960 కోట్లు ఉంటాయని అంచనా వేసింది. 2024లో ఈ బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు రూ.95,040 కోట్లుగా నమోదయ్యాయి. అంటే భారత్‌లో ఈ ఏడాది పండుగ అమ్మకాల్లో 31 శాతం నమోదయితే అమెరికాలో మాత్రం ఈ వృద్ధి 8.3 శాతానికి పరిమితమవుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. అమెరికా ఆర్థికవ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది అమ్మకాల్లో అంత వృద్ధి నమోదు కాకపోవచ్చని పేర్కొంది.
ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులే
దేశీయ ఆన్‌లైన్ అమ్మకాల్లో అత్యధికభాగం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయిన్సెస్ వస్తువులే అత్యధికంగా ఉంటున్నాయి. మొత్తం అమ్మకాల్లో 43 శాతం (సుమారు రూ.53 వేలకోట్లు) ఈ రెండు రంగాల్లోనే జరుగుతున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా మొబైల్ ఫోన్లు (26 శాతం) కొనుగోలు చేస్తున్నారు. తర్వాతి స్థానాల్లో లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు (22 శాతం), సౌందర్యసాధనాలు (21 శాతం) ఉన్నాయి. ఈ సారి ఖరీదైన వస్తువులను మెట్రో వాసులే కాకుండా నాన్ మెట్రో వాసులు కూడా అత్యధికంగా కొనుగోలు చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది.


