రూ.6.50 పలుకుతున్న గుడ్డు ధర
చలి తీవ్రత పెరిగితే రూ.7 దాటే చాన్స్
పెరవలి: కాలం కలసి వచ్చి, ప్రస్తుతం కోడి గుడ్డు ధరలు పెరగటంతో రైతులు నాలుగు డబ్బులు కళ్లజూస్తున్నారు. ఏడాది కాలంగా గిట్టుబాటు ధర లేక నష్టపోయిన వారికి.. ప్రస్తుతం లభిస్తున్న ధరలు ఊరటనిస్తున్నాయి. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో లక్షలాదిగా కోళ్లు చనిపోయాయి. దీని ప్రభావంతో ఏడాది కాలంగా కోడి మాంసంతో పాటు గుడ్లు తినడానికి మాంసాహార ప్రియులు భయపడ్డారు. ఫలితంగా కొనుగోళ్లు పడిపోయి, కోళ్ల రైతులు ఆర్థికంగా దెబ్బ తిన్నారు. అనేక కోళ్ల ఫామ్‌లు మూతపడిన పరిస్థితులు నెలకొన్నాయి.
దీనికితోడు మేత, పిల్ల ధరలు కూడా గణనీయంగా పెరగడంతో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా వేసవి, కార్తిక మాసంలో గుడ్ల అమ్మకాలు తగ్గుముఖం పడతాయి. కానీ, ఈ ఏడాది కార్తిక మాసం ప్రారంభంలో రూ.5.44 ఉన్న గుడ్డు ధర రానురానూ పెరుగుతూ ప్రస్తుతం రూ.6.50కు చేరింది. ఒకవైపు కార్తిక మాసం ముగిసినా.. అక్కడక్కడ అయ్యప్ప దీక్షధారులు ఉండటంతో ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల వినియోగం అంతంత మాత్రంగానే ఉంది.
అయితే, ఈపాటి వినియోగానికి సరిపడా ఉత్పత్తి కూడా లేకపోవడంతో ధరలు క్రమంగా పెరిగింది. డిసెంబర్ 15 తరువాత గుడ్లకు మరింత డిమాండ్ వస్తుందని, ధరలు మరింత పెరగవచ్చని రైతులు అంటున్నారు. చలి తీవ్రత పెరిగితే స్థానికంగాను, ఉత్తర భారతాన డిమాండ్ వచ్చి, గుడ్డు ధర రూ.7 కూడా దాటవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలాగే మరో మూడు నెలలు కొనసాగితే ఏడాదిగా జరిగిన నష్టాలను కొంత వరకూ పూడ్చుకోవచ్చని ఆశ పడుతున్నారు.
1.40 కోట్ల గుడ్ల ఉత్పత్తి
గత ఏడాది ఇవే రోజుల్లో జిల్లావ్యాప్తంగా 245 షెడ్లలో 1.60 కోట్ల కోళ్లను రైతులు పెంచేవారు. అయితే, ఆ సమయంలో బర్డ్‌ఫ్లూ సోకడంతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆ తరువాత కోళ్లు, గుడ్ల వినియోగం పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది కోళ్ల షెడ్లను ఖాళీగా వదిలేశారు. ఇప్పటికీ కొన్ని షెడ్లు ఖాళీగానే ఉన్నాయి.
అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 165 షెడ్లలో కోటి కోళ్లను పెంచుతున్నారు. వీటిల్లో ఒక్కో షెడ్డులో సుమారు 50 వేల నుంచి 5 లక్షల వరకూ కోళ్లను పెంచుతూంటారు. వీటితో పాటు 5 వేల నుంచి 40 వేల సామర్థ్యం కలిగిన పలు కోళ్లఫామ్‌లలో కోళ్ల సాగు జరుగుతోంది. ఒక్క అనపర్తి నియోజకవర్గంలోనే 70 లక్షలు, నిడదవోలు నియోజకవర్గంలో 50 లక్షలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో మరో 30 లక్షల కోళ్ల వరకూ పెంచుతున్నారు.
ఈ ఫామ్‌ల నుంచి రోజుకు 1.60 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం చలికాలం కావడంతో 1.40 కోట్ల గుడ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. జిల్లాలో గుడ్ల వినియోగం సాధారణంగా 40 లక్షల వరకూ ఉంటుంది. ప్రస్తుతం 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ మాత్రమే గుడ్లు స్థానికంగా వినియోగమవుతున్నట్లు పౌల్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు.
30 లారీలతో ఎగుమతులు
తూర్పు గోదావరి జిల్లా నుంచి నిత్యం 30 లారీల్లో ఒడిశా, పశి్చమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్‌తో పాటు అసోం తదితర ఈశాన్య రాష్ట్రాలకు కోడి గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అక్కడ చలి తీవ్ర మరింత పెరిగితే ఎగుమతులు రోజుకు 60 లారీల పైనే ఉంటుందని వ్యాపాÆý‡ులు చెబుతున్నారు. ఆ సమయంలో పెరిగే డిమాండ్‌కుఅనుగుణంగా గుడ్ల ధర కూడా అమాంతం పెరుగుతుందని అంటున్నారు.
ఇలాగే కొనసాగితే..
కోళ్ల ఫామ్‌లతో ఇప్పటి వరకూ నష్టాల బాట పట్టాం. ప్రస్తుతం గుడ్డు ధర పెరగటంతో గత నష్టాలను పూడ్చుకునే పనిలో ఉన్నాం. ధర ఇలాగే కొనసాగితే గత నష్టాల నుంచి బయట పడతాం. – భూపతిరాజు వరాహ నరసింహరాజు, ఖండవల్లి, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా
ఆర్థికంగా కోలుకుంటాం
గత 15 ఏళ్లుగా కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాను. ఏడాది కాలంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఆర్థికంగా నలిగిపోయాం. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.50 పలుకుతోంది. ఈ ధరలు మరో 3 నెలలుంటే గత నష్టాల నుంచి బయట పడి, ఆర్థికంగా కోలుకుంటాం. – మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టల వేమవరం, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా


