దిరిదో విజ్జల్‌పై రెండు రాష్ట్రాల్లో రూ.28 లక్షల రివార్డు
అతని భార్య మడవి మంగపై రూ.8 లక్షల రివార్డు
పాడేరు: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన మావోయిస్టు దంపతులు ఆదివారం పాడేరులో ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (ఎస్‌జెడ్‌సీఎం) దిరిదో విజ్జల్ అలియాస్ జైలాల్, అతని భార్య అయిన డివిజనల్ కమిటీ సభ్యురాలు (డీవీసీఎం) మడవి మంగ అలియాస్ విమల/భీమే లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల విసుగు చెందడంతోపాటు మావోయిçస్టులకు పట్టున్న ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ పెరగడం, కొత్త పోలీస్ క్యాంపులు పెట్టడం, మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, ఇటీవల కాలంలో వరుస ఎన్‌కౌంటర్లు, మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం తదితర కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చి స్వేచ్ఛా జీవితం గడిపేందుకు వారిద్దరూ లొంగిపోయారని చెప్పారు.
బాలల సంఘంలో చేరి.. బ్యాంక్ దోపిడీ చేసి..
దిరిదో విజ్జల్ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గగనపల్లి పంచాయతీ బోడెగుబ్బల్ గ్రామానికి చెందినవారు. 1994లో మావోయిస్టు పార్టీ బాలల సంఘంలో సభ్యుడిగా చేరారు. దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, జాతీయ పార్క్ ప్రాంతం, కుంటా, ఏవోబీ కటాఫ్ ఏరియా, గడ్చిరోలి, దర్భా ప్రాంతాల్లో మావోయిస్టు సభ్యుడిగా ఏసీఎం, పీపీసీఎం, ఎల్‌వోఎస్ కమాండర్, సెక్షన్ కమాండర్, కంపెనీ కమాండర్, సైనిక ఇన్‌చార్జిగా వివిధ విభాగాల్లో ఏకంగా 24 ఏళ్లు మావోయిస్టు పార్టీలో పని చేశారు.
ఏడు క్యాంప్ దాడులతో పాటు మరో ఏడు అంబు ష్, రెండు ఎదురు కాల్పుల్లో విజ్జల్ పాల్గొన్నారు. బ్యాంకు దోపిడీ, ఐఈడీ పేల్చిన ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్‌లో రూ.8 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.20 లక్షల రివార్డు ఉన్నాయి.
విప్లవ గీతాలకు ఆకర్షితురాలై..
మావోయిస్ట్ డివిజనల్ కమిటీ సభ్యురాలైన మడవి గంగి ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పుల్పాగిడే గ్రామానికి చెందినవారు. ఆమె 2006లో విప్లవ గీతాలకు ఆకర్షితురాలై మావోయిస్టు పార్టీలో చేరారు. 20 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కుంటా, బడేసత్తి, కెర్లపాల్, జగర్లొండ, మలెంగర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యురాలిగా, ఎల్‌వోఎస్ కమాండర్‌గా ఏసీఎంగా, ప్రాంత కమిటీ కార్యదర్శిగా, ఏసీ కార్యదర్శిగా ఏసీఎస్ ఇన్‌చార్జిగా, మలెంగర్ ఏసీఎస్ ఇన్‌చార్జిగా పని చేశారు. ఏడు ఎదురు కాల్పులతో పాటు అనేక హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గంగిపై రూ.8 లక్షల రివార్డు ఉంది.
పునరావాసం కల్పిస్తాం: ఎస్పీ
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు అందేలా చూస్తామని ఎస్పీ అమిత్‌బర్దర్ చెప్పారు. ఇద్దరికీ పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని, వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గం చూపిస్తామన్నారు. లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు బంధుమిత్రుల ద్వారా సమీప పోలీస్ స్టేషన్, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల వద్ద నేరుగా వచ్చి లొంగిపోవచ్చని సూచించారు.
హిడ్మా ఎన్‌కౌంటర్‌పై తప్పుడు ప్రచారం
మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మాతో పాటు మరికొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మావోయిస్టు లేఖ ద్వారా ప్రశ్నించారని.. దీనిపై మీ స్పందన ఏమిటని విలేకరులు ఎస్పీ అమిత్‌బర్దర్‌ను ప్రశి్నంచారు. దీనిపై ఆయన మాట్లాడుతూ మావోయిస్టులది ఆధారాలు లేని ఆరోపణలని, వారిది పూర్తిగా తప్పుడు ప్రచారమన్నారు. వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.


