భీమవరం: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భీమవరంలో వైయస్సార్సీపీ నాయకులు చినిమిల్లి వెంకట రాయుడు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ చార్జిషీట్‌తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనే కలవలేదనే వాస్తవాలు బయటకొచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు.
పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాడైతే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతు వధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేళాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 12 వేల గోవులను చంపి విశాఖలో 1.86 లక్షల టన్నుల మాంసాన్ని అక్రమంగా నిల్వ చేస్తే ఆరోజు పట్టించుకోని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.
నిజం చెబుతుంటే మాపై దాడులు
లడ్డూ కల్తీ పేరుతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని అల్లరి చేయడం మానుకుని తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కూటమి నాయకులంతా ముక్కు నేలకు రాసి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి. సీబీఐ సిట్ చార్జిషీట్ తర్వాత కూడా దుష్ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలేశుడిని వివాదాల్లోకి లాగడం సరికాదు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల ఆలోచనలను దృష్టి మళ్లించడం కోసం పదే పదే తిరుమల లడ్డూ అంశాన్ని తీసుకొచ్చి వైకుంఠవాసుడిని వివాదాల్లోకి లాగుతున్నారు. సిట్ చార్జిషీట్ బయటపెట్టి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ప్రజలకు వాస్తవాలు చెబుతున్నందుకు మా నాయకుల మీద వరుస పెట్టి దాడులకు దిగుతున్నారు.
జంతువుల కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేసింది
కల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించారంటూ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు. కల్తీ జరిగిందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్న నెయ్యి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే టీటీడీలోకి ప్రవేశించిన విషయాన్ని స్పష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్‌లో కూడా ఈ విషయం స్పష్టంగా రాసి ఉన్నా కూడా వైయస్సార్సీపీ మీద బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సమంజసం కాదు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో నార్కో ఎనాలిసిస్ టెస్టు సహా ఎలాంటి విచారణకైనా సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పిన తర్వాతైనా దుష్ప్రచారం ఆపడం లేదు. బాత్రూమ్‌లు కడిగే రసాయనాలు కలిపారంటూ చంద్రబాబు కొత్త ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి. చంద్రబాబు ప్రచారం చేస్తున్న బోలేబాబా డెయిరీకి కూడా టీడీపీ హయాంలోనే అనుమతులు లభించాయి.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసే కుట్ర
పాలన చేతకాక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కనిపించకుండా చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ. కనీసం స్కూళ్లలో చదివే పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందించలేకపోతున్నారు. రెండేళ్లు కూడా గడవకుండానే ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇన్నాళ్లూ తిరుమల లడ్డూ విషయంలో చేసిన తప్పుడు ప్రచారానికి గాను ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆలయ మెట్లు ఇప్పుడైనా సవ్యంగా పైనుంచి కిందకు కడగాలి. దేవుడి మీద నమ్మకం లేదని, దేవుడిని ఉరి తీయాలని చెప్పిన నాగబాబు సైతం సనాతన ధర్మం గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అవకాశవాద రాజకీయాలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరుస్తూ తప్పుడు ప్రచారం చేయడం తగదు. సీబీఐ సిట్ చార్జిషీట్‌లో మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్‌ల పేర్లు లేకపోయినా వారి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మాటలతో హిందువుల మనోభావాలను గాయపరచడం సరికాదు.
గోవధపై మీరెందుకు మాట్లాడటం లేదు?
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వారే అయితే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా (శ్లాటర్ హౌస్)ను తక్షణం మూసేయించాలి. ఇళ్ల మధ్య ఇష్టారాజ్యంగా జరుగుతున్న జంతు వధ కారణంగా వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా జరుగుతున్న జంతు వధను ఆపేలా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కూడా దృష్టిసారించాలి. శ్లాటర్ హౌస్‌పై పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కి దీనిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. విశాఖలో 1.85 లక్షల టన్నుల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేస్తే, అది టీడీపీ నాయకుడి అనుచరిదని తెలిసినా ఈ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎందుకు స్పందించలేదు? 12 వేల గోవులను చంపి ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే పట్టించుకోని ఈ కేంద్ర మంత్రి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసినా ఇప్పటికీ పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. దేవుడి మీద భయం, భక్తి ఉన్నవాళ్లు చేసే పనేనా ఇది? కేంద్ర తనిఖీల్లో హెరిటేజ్ పెరుగు మంచిది కాదని తేలింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అని కారుమూరి నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు.


