‘ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పాలసీ’ గత ప్రభుత్వం రూపకల్పన
రాష్ట్రంలో వార్షిక ఇంధన డిమాండ్ దాదాపు 65,830 మిలియన్ యూనిట్లు
రూ.11,778 కోట్ల విలువైన 16,875 మిలియన్ యూనిట్ల ఆదాకు ప్రణాళిక
25.6 శాతం విద్యుత్ పొదుపుతో పాటు 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించేలా అడుగులు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చతికిల పడ్డ ఇంధన పరిరక్షణ మిషన్
ఇంధన పరిరక్షణ వారోత్సవాల పేరుతో మొక్కుబడి ర్యాలీలకు సన్నద్ధం
సాక్షి, అమరావతి : విద్యుత్ చార్జీల బాదుడుపై చూపించిన ఆసక్తిని ప్రభుత్వం ఆదా చేయడంలో చూపడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం వార్షిక ఇంధన డిమాండ్ దాదాపు 65,830 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఇందులో రూ.11,778 కోట్ల విలువైన సుమారు 16,875 మిలియన్ యూనిట్లు ఆదా చేసేందుకు గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తద్వారా 25.6 శాతం విద్యుత్ ఆదాతో 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించేలా అడుగులు వేసింది.
అందుకు అనుగుణంగా ‘ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పాలసీ’ని గత ప్రభుత్వం రూపొందించింది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక బిల్లుల మోత మోగుతుండగా ఆదా చర్యలు మాత్రం పూర్తిగా అటకెక్కాయి. ఇంధన పరిరక్షణ వారోత్సవాల పేరుతో గతేడాది మొక్కుబడిగా ర్యాలీలు నిర్వహించి సరిపెట్టింది. ఏడాదంతా విద్యుత్ పొదుపు సంగతే మర్చిపోయింది.
మళ్లీ ఇప్పుడు ఈ నెల 14 నుంచి రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు వారోత్సవాల నిర్వహణకు సిద్ధమవుతోంది. స్టార్ హోటల్‌లో ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమాలను నిర్వహించి కేంద్రం ఇచ్చే డబ్బులను ఖర్చు చేయడం మినహా పొదుపు చర్యలు శూన్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వంలో ఆదర్శంగా ఏపీ..
ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వ విభాగాలలో ఇంధన పరిరక్షణ సెల్‌ల ఏర్పాటుకు జీవో జారీ చేసిన ఏకైక రాష్ట్రంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడం, ఆర్థిక కార్యకలాపాలను పెంచడం, పర్యావరణ ప్రయోజనాలతో పాటు విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూర్చే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేసింది.
ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యుత్ వినియోగదారులతో సహా అందరిని భాగస్వాములుగా చేసి ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య జీవన విధానాలను అనుసరించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ ‘ఏపీఎస్‌ఈసీఎం’ ద్వారా చర్యలు తీసుకుంది. పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) స్కీమ్ అమలులో దేశంలోనే అత్యుత్తమంగా ఏపీఎస్‌ఈసీఎం నిలిచింది.
గత కొన్నేళ్లుగా రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్లను వివిధ సెక్టార్లలో ఆదా చేయడంలోనూ ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. పారిశ్రామిక రంగంలో ఒక్క ‘పాట్’ ద్వారానే రూ.2,394 కోట్ల విలువైన దాదాపు 3,430 మిలియన్ యూనిట్లు ఆదా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఈసీఎం చేపట్టిన ఉత్తమ విధానాలను అనుసరించాలని నాటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె సింగ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయడం గమనార్హం.


