సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు.
నా ధైర్యం మీరే…
నా బలం మీరే…
నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన
మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.
కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు.
పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం… pic.twitter.com/avdEzEGkjg— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2026
గురువారం పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో పార్టీ కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన వైఎస్ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.
మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011, మార్చి 12న పుట్టిన మన పార్టీ, ఈరోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది.
విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్‌ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను.
ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ, దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్‌కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు. కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.
ఈరోజు నేను చెబుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి, మరొక్కసారి మీ అందరికి కూడా వినమ్రంగా, వినయపూర్వకంగా, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు మరొక్కసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా వైఎస్సార్‌ను ప్రేమించే ప్రతి గుండె, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు.


