పాక్ గూఢచర్యం కేసులో రూ.కోట్ల లావాదేవీలు.
రిజ్వాన్ కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు
అమృత్‌సర్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్ న్యాయవాది రిజ్వాన్ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్‌కు రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్‌సర్ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్ అలియాస్ పర్వేజ్ పోలీసులకు తెలిపాడు.
2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు రిజ్వాన్‌తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్ కారులో అమృత్‌సర్ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్‌సర్ వెళ్లారని ముషారఫ్ చెప్పాడు.
ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
రూ.41 లక్షలు సేకరించి..
రిజ్వాన్ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్ ఏడుసార్లు అమృత్‌సర్ వెళ్లాడు. రిజ్వాన్‌కు తౌరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా, సోహ్నాలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్ ల్యాప్‌టాప్, ఫోన్‌లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్ పోలీసు బృందాలు పంజాబ్ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి.


