ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.
ఈ టోర్నీలో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్‌పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు.
అనంతరం రాజ్ లింబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌తో పాటు అన్మోల్‌ప్రీత్ సింగ్ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. నమన్ ధిర్ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్ రావత్ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్‌లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ.


