ఇద్దరు అతిథులు మృత్యువాత
లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో శనివారం రాత్రి పెళ్లి వేడుకకు వచ్చిన వైరి వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో అతిథులిద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పఖోవల్ రోడ్డులో జరిగే పెళ్లికి వరుడు ప్రత్యర్థి వర్గాల వారికి ఆహ్వానం పంపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో వేదిక వద్ద రెండు గ్రూపులు ఎదురుపడ్డాయి. ఏదో విషయమై వారి మధ్య గొడవ ముదిరింది.
పరస్పరం కాల్పులకు దిగారు. కనీసం 20 రౌండ్ల వరకు కాల్చారు. పెళ్లికి హాజరైన ఇద్దరు వ్యక్తులు బుల్లెట్లు తగిలి చనిపోయారు. పోలీసుల రాకతో రెండు గ్రూపులు అక్కడి నుంచి పరారయ్యాయి. వీరిని పెళ్లికి ఆహా్వనించిన వరుడితోపాటు భద్రతా నిబంధనలను పాటించని ఫంక్షన్ హాల్ నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


