జనాభిప్రాయాన్ని మార్చండి
పోలీసులకు మోదీ హితవు
విచ్చిన్న శక్తులపై డేగకన్ను
రాయ్‌పూర్: పోలీసులంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న భావనను ఎంతగానో మెరగుపరచాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అది జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. అందుకోసం వారే సున్నితత్వం, జవాబుదారీతనం పెంచుకోవాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఆ శాఖలో ప్రొఫెషనలిజం మరింత మెరుగవాలని ఆకాంక్షించారు.
రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన డీజీపీలు, ఐజీల 60వ అఖిల భారత సదస్సును ఉద్దేశించి ఆదివారం ఆయన ప్రసంగించారు. విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడేందుకు పొంచి ఉన్న నిషేధిత శక్తులపై నిత్యం డేగ కన్నుంచడం కూడా అత్యవసరమని ఉద్బోధించారు. వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తమైన ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అప్పుడే ప్రజల్లో వారిపట్ల మరింత సదభిప్రాయం కలుగుతుందని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సువిశాలమైన భారత తీర రక్షణను మరింత బలోపేతం చేసేందుకు వినూత్న చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని చెప్పారు.
‘వికసిత భారతం: భద్రతా కోణాలు’ ప్ర«దానాంశంగా ఈ సదస్సు జరిగింది. డ్రగ్స్ భూతం కట్టడి మొదలుకుని తీర రక్షణ దాకా విభిన్నాంశాలపై మూడు రోజుల పాటు లోతైన చర్చ జరిగింది. విజన్ 2047 సాకారానికి పోలీసులపరంగా తీసుకోవాల్సిన పలు చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. హిడ్మా తదితర మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు ఇటీవలే ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో ఛత్తీతగఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సదస్సు జరగడం గమనార్హం. అర్బన్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడం, పర్యాటక పోలీసింగ్‌ను మరింత స్నేహశీలంగా మార్చడం, కొత్తగా వచ్చిన భారత న్యాయ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయడం తదితరాలపై పోలీసులు బాగా దృష్టి సారించాలని మోదీ హితవు పలికారు.
ప్రాకృతిక విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే విషయంలోనూ పోలీసులు ముందు వరుసలో నిలవాలన్నారు. పోలీసు విచారణల్లో ఫోరెన్సిక్ వాడకంపై కేస్ స్టడీలు రూపొందించాల్సిందిగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు పలుపునిచ్చారు. ఇంటలిజెన్స్ బ్యూరోకు చెందిన అధికారులకు రాష్ట్రపతి పోలీసు మెడల్స్‌ను మోదీ ఈ సందర్భంగా ప్రదానం చేశారు. అర్బన్ పోలీసింగ్‌లో అత్యుత్తమంగా నిలిచిన నగరాలకు తొలిసారిగా ప్రవేశపెట్టిన అవార్డులను అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీలు, కేంద్ర పోలీసు బలగాల సారథులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. మరో 700 మందికి పైగా పోలీసు ఉన్నతాధికారులు వర్చువల్‌గా ఈ కీలక సదస్సులో భాగం పంచుకోవడం విశేషం.


