దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం  | PM Narendra Modi unveils Lord Ram statue in Goa | Sakshi
Sakshi News home page

దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం 

Nov 29 2025 5:18 AM | Updated on Nov 29 2025 5:18 AM

PM Narendra Modi unveils Lord Ram statue in Goa

ప్రజలు ఐక్యంగా ఉంటేనే ‘వికసిత్‌ భారత్‌’ సాధ్యం: మోదీ 

77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరణ  

పణజి: దేశ ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే వికసిత్‌ భారత్‌ స్వప్నం సాకారం అవుతుందని ప్రధాని  మోదీ స్పష్టంచేశారు. సమాజమంతా ఒక్కటిగా, అన్ని రంగాలూ భుజంభుజం కలిపి పనిచేస్తే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆయన అన్నారు. దేశంలో నేడు సాంస్కృతిక పునరుజ్జీవనం కొనసాగుతోందని మోదీ చెప్పారు. 

అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణం, కాశీలో విశ్వనాథ్‌ ధామ్‌ అభివృద్ధి, ఉజ్జయినిలో మహాకాళ్‌ మహాలోక్‌ ఆలయ విస్తరణ వంటి చర్యలు జాతి మేల్కొల్పునకు ప్రతీకలు అని ఆయన వివరించారు. మన సాంస్కృతిక వారసత్వం నూతన శక్తితో ముందుకు పరుగులు తీస్తోందని అన్నారు. భవిష్యత్తు తరాల ప్రజలు వారి మూలాల నుంచి దూరం కాకుండా ఈ పునరుజ్జీవనం స్ఫూర్తినిస్తుందని తెలిపారు. 

మోదీ శుక్రవారం గోవాలో పర్యటించారు. దక్షిణ గోవాలోని పార్తాగలీలో శ్రీసంస్థాన్‌ గోకర్ణ జీవోత్తం మఠం 550వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్రీరాముడి విగ్రహం కావడం విశేషం. గుజరాత్‌లో నర్మదా నది తీరాన నెలకొల్పిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్‌ సుతార్‌ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement