అది ముస్లిం లీగ్‌–మావోయిస్టు కాంగ్రెస్‌  | Congress has transformed into Muslim League Maoist Congress | Sakshi
Sakshi News home page

అది ముస్లిం లీగ్‌–మావోయిస్టు కాంగ్రెస్‌ 

Mar 1 2026 4:19 AM | Updated on Mar 1 2026 4:19 AM

Congress has transformed into Muslim League Maoist Congress

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం  

రాజస్తాన్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం 

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం  

జైపూర్‌/సనంద్‌: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాల ఎదుట మనదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్‌ వదులుకోవడం లేదని మండిపడ్డారు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ) నేడు ముస్లింలీగ్‌–మావోయిస్టు కాంగ్రెస్‌(ఎంఎంసీ)గా మారిందంటూ ధ్వజమెత్తారు. 

ముస్లిం లీగ్‌ వల్ల భారతదేశం ముక్కలైందని చెప్పారు. నేడు కాంగ్రెస్‌ కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మావోయిస్టుల దారిలోనే నడుస్తూ దేశంపై దాడి చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం రాజస్తాన్‌లోని అజీ్మర్‌లో పర్యటించారు. రూ.16,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా జరిగే హ్యూమన్‌ ప్యాపిలో మా వైరస్‌(హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచ దేశాలు మన దేశం గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. కానీ, కాంగ్రెస్‌ మాత్రం విదేశీయుల ఎదుట భారతదేశాన్ని కించపర్చడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఆ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే ఉందన్నారు. 

అది తట్టుకోలేక దేశ ప్రతిష్టను దెబ్బతీస్తూ ప్రతీకా రం తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. దేశాన్ని కించపర్చడం, సైనిక దళాలను బలహీనపర్చడం కాంగ్రెస్‌కు అలవాటేనని పేర్కొన్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, పేపర్‌ లీక్‌ వార్తలు నిత్యం వచ్చేవని గుర్తుచేశారు. నేడు రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని, ప్రజలకు ఎనలేని మేలు చేస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. నేడు పేపర్‌ లీక్‌లు లేవని, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు.  

నేడు తిరుప్పరకుండ్రంలో మోదీ పూజలు  
ప్రధాని మోదీ శనివారం తమిళనాడులోని చెన్నైకి చేరుకున్నారు. ఆయన ఆదివారం మదురై, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. తిరుప్పరకుండ్రంలోని అరుళ్‌మిగు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.  

గుజరాత్‌లో సెమీకండక్టర్‌ ప్లాంట్‌ ప్రారంభం  
గుజరాత్‌లోని సనంద్‌లో మైక్రాన్‌ టెక్నాలజీ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో భారత్‌ తన సత్తాను ఇప్పటికే నిరూపించుకుందని ఆయన చెప్పారు. అలాగే హార్డ్‌వేర్‌ రంగంలోనూ శరవేగంగా దూసుకెళ్తోందని, ప్రత్యేక గుర్తింపును సాధిస్తోందని తెలిపారు. అమెరికా భాగస్వామ్యంలో ఈ ప్లాంట్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. 

ఇరుదేశాల మధ్య బలమైన మైత్రికి ఇదొక ఉదాహరణ అని వివరించారు. ఇది ఏటీఎంపీ(అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్‌) ప్లాంట్‌. భారత్‌లో ఈ తరహా ప్లాంట్లలో ఇదే మొదటిది కావడం విశేషం. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వ్యాపార వృద్ధికి ఇక్కడ చక్కటి అవకాశాలు ఉన్నాయని సూచించారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గత శతాబ్దాన్ని చమురు శాసించిందని, ఇప్పుటి శతాబ్దాన్ని మైక్రోచిప్‌ శాసించబోతోందని తేలి్చచెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement