ఆవిష్కరణల స్ఫూర్తికి నీరాజనం: ప్రధాని మోదీ | We celebrate spirit of research and innovation: PM Modi | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణల స్ఫూర్తికి నీరాజనం: ప్రధాని మోదీ

Feb 28 2026 12:08 PM | Updated on Feb 28 2026 12:13 PM

We celebrate spirit of research and innovation: PM Modi

న్యూఢిల్లీ: భారత గడ్డపై విజ్ఞాన శాస్త్ర వైభవాన్ని చాటిచెప్పిన మహోన్నత ఘట్టం ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు గుర్తుగా శనివారం దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న పరిశోధన, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ రోజు ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు.
 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ అసాధారణ ప్రతిభతో కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ భారతీయ శాస్త్రీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారత పరిశోధనా రంగానికి సముచిత గుర్తింపు తీసుకువచ్చిందని ప్రశంసించారు. యువతను సాధికారత వైపు నడిపించడం, పరిశోధనల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రపంచ సంక్షేమం కోసం సాంకేతికతను వినియోగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ కూడా శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ, కృత్రిమ మేధ (AI) నుండి రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన రంగాల వరకు భారతీయ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి దేశ ఆర్థిక వ్యవస్థను, భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతూ, వారి నిరంతర జ్ఞానాన్వేషణ స్వయంసమృద్ధ భారత్‌ నిర్మాణానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1928 ఫిబ్రవరి 28న సీవీ రామన్ కాంతి పరిక్షేపణంపై చేసిన పరిశోధనకు గానూ 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. విజ్ఞాన శాస్త్ర రంగంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.

ఇది కూడా  చదవండి: బీటీఎస్ స్టార్ ప్రాణహాని వ్యాఖ్యలు.. అభిమానుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement