రూ.58 వేల కోట్లతో 15 మంది ఆర్థిక నేరగాళ్లు పరారు! | How Billionaire Frauds Crippled India Banking System | Sakshi
Sakshi News home page

రూ.58 వేల కోట్లతో 15 మంది ఆర్థిక నేరగాళ్లు పరారు!

Feb 28 2026 10:23 AM | Updated on Feb 28 2026 10:29 AM

How Billionaire Frauds Crippled India Banking System

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన బ్యాంకింగ్ రంగాన్ని కొందరు బడా బాబులు కుప్పకూల్చుతున్నారు. సామాన్యుడు తీసుకున్న చిన్నపాటి రుణానికి వడ్డీ మీద వడ్డీ వేసి వసూలు చేసే బ్యాంకులు, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో మాత్రం నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌ 31 నాటికి అందిన గణాంకాల ప్రకారం దేశంలో 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా గుర్తించగా, అందులో 9 మంది బ్యాంకింగ్ వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీశారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

విదేశాలకు పారిపోయిన ఈ నేరగాళ్ల నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం అక్షరాలా రూ.58,082 కోట్లు. అయితే, ఇప్పటి వరకు రికవరీ అయింది కేవలం రూ.19,187 కోట్లు మాత్రమే. అంటే సుమారు 67% నిధులు ఇంకా ఎగ్గొట్టిన వారి చేతుల్లోనే ఉన్నాయి.

బ్యాంకుల వారీగా బకాయిలు - వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో)

బ్యాంక్రావాల్సింది (వడ్డీతో)వసూలైంది
ఎస్‌బీఐ22,06711,412
పంజాబ్‌ నేషనల్ బ్యాంక్10,9281,619
బ్యాంక్ ఆఫ్ ఇండియా5,5891,450
యూనియన్ బ్యాంక్4,9511,316
ఇండియన్ బ్యాంక్3,062453
బ్యాంక్ ఆఫ్ బరోడా3,0501,167
కెనరా బ్యాంక్2,43547
యూకో బ్యాంక్2,346882
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్2,219581

 

మోసగాళ్ల మాస్టర్ ప్లాన్

బ్యాంకుల నుంచి భారీ రుణాలు పొందేందుకు, ఆపై వాటిని ఎగ్గొట్టేందుకు నేరగాళ్లు ప్రధానంగా కొన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. షెల్ కంపెనీలు(కాగితాల మీద మాత్రమే ఉండే కంపెనీలు) సృష్టించి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి నిధులను మళ్లించడం ద్వారా అసలు డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా మనీ లాండరింగ్ చేస్తున్నారు.

  • నాసిరకం భూములు లేదా తక్కువ విలువ గల ఆస్తులను బ్యాంకులకు కుదువ పెట్టి అధికారుల అండదండలతో వాటి విలువను భారీగా చూపి వందల కోట్ల రుణాలు పొందుతున్నారు.

  • దిగుమతుల పేరుతో బ్యాంకులను గ్యారెంటీగా ఉంచి విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు(లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ దుర్వినియోగం). పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ తరహాలో ఈ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు.

బ్యాంకులు, ప్రభుత్వం ఏం చేస్తోంది?

పరారీలో ఉన్న నేరగాళ్లపై పట్టు బిగించేందుకు కేంద్రం ‘ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018’ని తీసుకువచ్చింది. నేరగాళ్లకు సంబంధించిన దేశీ, విదేశీ ఆస్తులను అటాచ్ చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా విదేశాల్లో ఉన్న ఆస్తుల జప్తు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇంటర్‌పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి సంబంధిత దేశాల నుంచి వారి అప్పగింత కోసం దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు.

మరింత సమర్థంగా వసూళ్లు జరగాలంటే..?

కేవలం చట్టాలు ఉంటే సరిపోదు.. వాటి అమలులో వేగం పెరగాలి. ఫోరెన్సిక్ ఆడిట్ విధిగా నిర్వహించాలి. రుణం తీసుకున్న కంపెనీ నిధులు మళ్లిస్తుందనే అనుమానం రాగానే ముందస్తుగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం వల్ల వారు దేశం విడిచి పారిపోకముందే అడ్డుకోవచ్చు. పన్ను ఎగ్గొట్టి తలదాచుకునేందుకు వెళ్లే విదేశాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవాలి. తద్వారా నిందితులు దాచుకున్న రహస్య ఖాతాల సమాచారం త్వరగా లభిస్తుంది. ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ ఏళ్ల తరబడి సాగకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలి. లోపభూయిష్టమైన డాక్యుమెంట్లతో రుణాలు మంజూరు చేసిన బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

సామాన్యుడి సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆర్థిక నేరగాళ్ల విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, బ్యాంకింగ్ రంగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ బకాయిల వసూలు సాధ్యమవుతుంది.

ఇదీ చదవండి: షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement