హైదరాబాద్ : ‘క్షణికావేశంలో తప్పు చేశాం. జైలు జీవితం చాలా పాఠాలు నేర్పింది. కుటుంబం విలువ తెలిసొచ్చింది. ఇది మాకు మరో జన్మ. ఇంకెప్పుడూ జైలు, పోలీసు స్టేషన్ వైపు కూడా వెళ్లం. ఊళ్లలో పనిచేసుకుంటూ బతుకుతాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించడంతో మంగళవారం విడుదలైన 91 మంది (85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు) యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ముక్తకంఠంతో చెప్పారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ విడుదలైన ఖైదీలంతా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.
జైళ్లలో నేర్చుకున్న వృత్తి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని మంచి పౌరులుగా జీవించాలని హితవు పలికారు. అప్పుడే తమ శ్రమకు ఫలితం లభిస్తుందన్నారు.
విడుదలైన వారిలో 38 మందికి జైళ్లశాఖ పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తూ నియామక పత్రాలను అందజేశారు.
జైళ్ల శాఖ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫండ్ నుంచి నిధులు సమకూర్చి నలుగురు మహిళా ఖైదీలకు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన కుట్టు మిషన్లు అందించారు.


