బీటీఎస్ స్టార్ ప్రాణహాని వ్యాఖ్యలు.. అభిమానుల ఆందోళన | BTS star Jungkook claims people want to kill me in disturbing video | Sakshi
Sakshi News home page

బీటీఎస్ స్టార్ ప్రాణహాని వ్యాఖ్యలు.. అభిమానుల ఆందోళన

Feb 28 2026 11:37 AM | Updated on Feb 28 2026 11:43 AM

BTS star Jungkook claims people want to kill me in disturbing video

సియోల్: దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ (BTS) సభ్యుడు జంగ్‌కుక్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగేళ్ల విరామం తర్వాత తమ కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ (Arirang) విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, జంగ్‌కుక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీవర్స్ (Weverse) ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభమైన ఈ ప్రత్యక్ష ప్రసారం దాదాపు 88 నిమిషాల పాటు సాగింది.

ఆ సమయంలో జంగ్‌కుక్ మద్యం సేవిస్తూ, తన స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ కనిపించారు. అయితే, ఆ వీడియోలో ఆయన ప్రదర్శించిన భావోద్వేగ స్థితి, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లైవ్ సెషన్‌లో జంగ్‌కుక్ మాట్లాడుతూ.. ‘నన్ను ఇష్టపడని వారు, నా ఎదుగుదలను అడ్డుకోవాలని చూసే వారు ఉండొచ్చు.. కొందరైతే నన్ను చంపాలని కూడా అనుకుంటున్నారు. కానీ అందులో తప్పేముంది? నేను వాటి గురించి పట్టించుకోను’ అని ఆయన వ్యాఖ్యానించారు. లైవ్ వీడియోల విషయంలో తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోదలుచుకోలేదని, తన మనసుకు నచ్చినట్టు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.
 

ఈ క్రమంలో తన మేనేజ్‌మెంట్ సంస్థ (BigHit) గురించి కూడా ప్రస్తావిస్తూ, ఇకపై కంపెనీ నిబంధనల గురించి తనకు చింత లేదని, తన ఇష్టప్రకారం బతుకుతానని  జంగ్‌కుక్ చెప్పారు. తన ధూమపాన అలవాటుపై కూడా జంగ్‌కుక్  మాట్లాడారు. ప్రస్తుతం తాను ధూమపానం చేయడం లేదని, ఎంతో కష్టపడి ఆ అలవాటును మానుకున్నానని వెల్లడించారు. 30 ఏళ్ల వయసులో ఉన్న తాను ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటంలో తప్పేమీ లేదని భావిస్తున్నప్పటికీ, తాను ఏ విషయం మాట్లాడినా కంపెనీ వారు పెద్ద రభస చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో వీవర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించబడినప్పటికీ, దానికి సంబంధించిన క్లిప్పింగ్‌లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రాణహాని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కొరియన్ మీడియా కంటే అంతర్జాతీయ అభిమానులే ఎక్కువగా స్పందిస్తున్నారు. స్థానిక మీడియా ఆయన అలవాట్లను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని, కానీ ఆయన మానసిక ఆరోగ్యం,  భద్రతను విస్మరిస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ, బీటీఎస్ గ్రూప్ మార్చి 20న వారి కొత్త స్టూడియో ఆల్బమ్ ‘అరిరంగ్’ను విడుదల  చేయనుంది. సైనిక సేవ పూర్తి చేసుకున్న తర్వాత సభ్యులందరూ కలిసి పాల్గొనే మొట్టమొదటి గ్లోబల్ కాన్సర్ట్ ‘బీటీఎస్ ది కమ్ బ్యాక్ లైవ్ అరిరంగ్’ మార్చి 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్త ఆర్మీ (BTS Fans) వేచి చూస్తున్న తరుణంలో, జంగ్‌కుక్ వ్యాఖ్యలు ఈ వేడుకలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement