ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే? | North Korean leader Kim daughter amid succession speculations | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే?

Feb 28 2026 11:08 AM | Updated on Feb 28 2026 11:20 AM

North Korean leader Kim daughter amid succession speculations

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిని ఖరారు చేశారా? గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ చర్చకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన కుమార్తె కిమ్ జు ఆయేను దేశ తదుపరి అత్యున్నత నేతగా తీర్చిదిద్దే క్రమంలో కిమ్ కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో జు ఆయే స్వయంగా స్నిపర్ రైఫిల్‌ను ధరించి, లక్ష్యాన్ని ఛేదిస్తున్న చిత్రాలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ (KCNA) విడుదల చేయడం అంతర్జాతీయ స్థాయిలో  చర్చనీయాంశంగా మారింది. సైనిక అధికారులకు కిమ్ జోంగ్ ఉన్  ఇటీవల కొత్త తరం స్నిపర్ రైఫిళ్లను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్‌ తన కుమార్తెకు కూడా ఒక రైఫిల్‌ను బహుకరించడం విశేషం. ఈ ఆయుధాలను అద్భుతమైన ఆయుధాలుగా వర్ణించిన కిమ్, ఇవి తన నమ్మకానికి ప్రతీకలని పేర్కొన్నారు.

ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యూపీకే) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ తయారు చేసిన అత్యాధునిక రైఫిళ్లను కిమ్ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కిమ్‌ కుమార్తె జు ఆయే(13) తన తండ్రి తరహాలోనే లెదర్ జాకెట్ ధరించి షూటింగ్ రేంజ్‌లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు  కిమ్‌ ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి. గతంలో ఆమెను కేవలం కుమార్తెగా పిలిచిన ప్రభుత్వ మీడియా ఇప్పుడు ‘గౌరవనీయ కుమార్తె’గా సంబోధిస్తుండటం గమనార్హం.

జు ఆయే ఇప్పటికే తన వారసత్వ శిక్షణను పూర్తి చేసుకుని, అధికారిక హోదాను ఖరారు చేసే దశకు చేరుకుందని దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్‌) చెబుతోంది. ఆమె ఇప్పటికే విధానపరమైన అంశాల్లో తనదైన ముద్ర వేస్తోందని, దేశంలో అప్రకటిత రెండో అత్యున్నత నేతగా చలామణి అవుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైఫిల్‌ను స్వీకరించారు. అయితే, మొదటిసారిగా కేసీఎన్ఏ ఆమెను పార్టీ కేంద్ర కమిటీలోని ‘జనరల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్’గా గుర్తించి, ఆమె అధికార పరిధిని స్పష్టం చేసింది.

ఒకప్పుడు కిమ్ వారసురాలిగా యో జోంగ్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు జు ఆయే తెరపైకి రావడం కొరియా రాజకీయాల్లో కొత్త మలుపుగా పరిగణిస్తున్నారు. కిమ్ ఇల్ సంగ్ స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జు ఆయే బాధ్యతలు చేపడితే, కిమ్ కుటుంబం నుంచి నాలుగో తరం నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించనుంది. కిమ్ జోంగ్ ఉన్ అడుగుజాడల్లో నడుస్తూ, సైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాల్లో చురుగ్గా కనిపిస్తున్న జు ఆయే, రాబోయే రోజుల్లో ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: ‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement