గ్రీన్‌పార్టీ అభ్యర్థి హన్నా స్పెన్సర్ విజయం
లండన్: ఇంగ్ల్లండ్‌లో జరి గిన ఉప ఎన్నికలో అధికార లేబర్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గోర్టన్ డెంటన్ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గ్రీన్ పార్టీ అభ్యర్థి అనూహ్యంగా గెలుపొందారు. వృత్తిరీత్యా ప్లంబర్ అయిన హన్నా స్పెన్సర్(34) 4,402 ఓట్ల మెజారిటీ సాధించారు.
మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఈమెకు 14,980 ఓట్లు దక్కగా, రిఫార్మ్ యూకే పార్టీకి చెందిన మాథ్యూ గుడ్విన్‌కు 10,758 ఓట్లు, అధికార లేబర్ పార్టీ అభ్యర్థి ఏంజెలికి స్టోగియాకు 9,364 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో పార్లమెంట్‌లో గ్రీన్ పార్టీ ప్రాతినిధ్యం ఐదు స్థానాలకు పెరిగింది. గోర్టన్ డెంటన్ సీటు 1931 తర్వాత లేబర్ పార్టీ నుంచి చేజారడం ఇదే మొదటిసారి. తాజా ఓటమిపై ప్రధాని స్టార్మర్ స్పందించారు.
ఇది చాలా నిరుత్సాహం కలిగించిన పరిణామమన్నారు. మధ్యంతర ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు సాధారణమేనంటూ సమరి్థంచుకున్నారు. అయితే, ఎన్నికల వేళ భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలతో స్టార్మర్ ఉన్న చిత్రాల కరపత్రాలను, ఉర్దూ వీడియోలను విడుదల చేయడం వంటి చర్యలతో అక్కడి అత్యధిక సంఖ్యలో ఉన్న బ్రిటిష్ పాకిస్తానీ ఓటర్లను గ్రీన్‌పార్టీ ప్రభావితం చేసిందన్న విమర్శలున్నాయి. 2024 ఎన్నికల్లో గోర్టన్‌డెంటన్ స్థానాన్ని లేబర్ పార్టీకి చెందిన అండ్రూ గ్విన్ 13,413 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. వేధింపుల ఆరోపణల కారణంగా ఆండ్రూ రాజీనామా చేయగా, తాజాగా ఉప ఎన్నిక నిర్వహించారు.


