వచ్చే వారం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు
బీజింగ్: చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పారీ్టలో శక్తివంతమైన స్టాండింగ్ కమిటీ భారీగా ప్రక్షాళన చర్యలను ప్రకటించింది. తొమ్మిది మంది సైనిక అధికారులు సహా మొత్తం 19 మందిని తాజాగా విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన చేసింది. అయితే, ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా అవినీతి ఆరోపణలతో సంబంధమున్న సందర్భాల్లోనే ఇలాంటి తొలగింపు చర్యలను స్టాండింగ్ కమిటీ చేపడుతుంది.
మార్చి 5వ తేదీ నుంచి వార్షిక నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దాదాపు 14 ఏళ్లుగా ఎదురులేకుండా అధికారంలో కొనసాగుతున్న అధ్యక్షుడు జిన్‌పింగ్ శత్రువులను తొలగించుకోవడం, విధేయతను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఉద్వాసనకు గురైన వారిలో సైన్యంలోని అత్యున్నత విభాగం సెంట్రల్ మిలటరీ కమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రాకెట్ ఫోర్స్‌లకు చెందిన అధికారులు..వివిధ ప్రావిన్సులు, ప్రాంతాల ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరితోపాటు మిలటరీ కోర్టు, ప్రెసిడెంట్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ శాఖ మంత్రి వాంగ్ కూడా ఉన్నారు. దీంతో, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 2,878కు తగ్గిందని చెబుతున్నారు. ఈ తొలగింపు ప్రభావం వారం పాటు కొనసాగే పీపుల్స్ కాంగ్రెస్‌పై ఏమాత్రం ఉండబోదంటున్నారు.


