టీ20 వరల్డ్‌కప్ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 పోరులో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది.
చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు.
అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ మూడంకెల స్కోర్ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేసింది జాక్స్, కర్రన్ మాత్రమే. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).
ఈ మ్యాచ్ విన్నింగ్ శతకంతో బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్‌కు కూడా చేర్చాడు. బ్రూక్ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?
టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ
హ్యారీ బ్రూక్- 50 బంతులు (తాజా మ్యాచ్‌లో)
అలెక్స్ హేల్స్- 60
జోస్ బట్లర్- 67
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్లు
బ్రూక్- 100 (తాజా మ్యాచ్‌లో)
క్రిస్ గేల్- 98
లోర్కాన్ టక్కర్- 94 నాటౌట్
రోహిత్ శర్మ- 92
ఈ సెంచరీతో బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ ఈ ఘనత సాధించారు.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు సూపర్-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్‌కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే.
అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్‌లో భారత్ సెమీస్ బెర్త్‌ను సంక్లిష్టం చేసుకుంది.


