మరోసారి ‘షూటౌట్‌’లో... | Indian mens hockey team suffers seventh consecutive defeat | Sakshi
Sakshi News home page

మరోసారి ‘షూటౌట్‌’లో...

Feb 25 2026 2:39 AM | Updated on Feb 25 2026 2:39 AM

Indian mens hockey team suffers seventh consecutive defeat

భారత పురుషుల హాకీ జట్టుకు వరుసగా ఏడో పరాజయం

హోబర్ట్‌: ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలో ఓటమి పాలైన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ‘షూటౌట్‌’లో ఓడిపోయింది. రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం స్పెయిన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ సింగ్‌ బృందం ‘షూటౌట్‌’లో 3–4 గోల్స్‌ తేడాతో ఓటమి చవిచూసింది. స్పెయిన్‌కు రెండు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్‌ లభించింది. 

నిర్ణీత సమయంలో 59 నిమిషాల వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... 59వ నిమిషంలో గోల్‌ సమర్పించుకుంది. దాంతో స్పెయిన్‌ 1–1తో స్కోరును సమం చేసింది. ఆట 19వ నిమిషంలో మణీందర్‌ సింగ్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి విజయం దిశగా సాగింది. మరో రెండు నిమిషాలు పూర్తయితే భారత్‌కు తొలి గెలుపు ఖాయమయ్యే స్థితిలో స్పెయిన్‌ ప్లేయర్‌ బ్రూనో ఫాంట్‌ గోల్‌ చేశాడు. 

చివరి 13 సెకన్లలో స్పెయిన్‌కు ఏకంగా మూడు పెనాల్టీ కార్నర్‌లను సమర్పించుకున్న భారత్‌ వాటిని నిలువరించింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ను నిర్వహించారు. ‘షూటౌట్‌’లో స్పెయిన్‌ ఆటగాళ్లు తొలి నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకోగా... భారత్‌ తరఫున అభిషేక్, కెప్టెన్‌ హార్దిక్‌ సింగ్‌ గురి తప్పడంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్‌లో స్పెయిన్‌కు ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లు, భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. 

అయితే రెండు జట్లు అన్నింటిని వృథా చేశాయి. నేడు జరిగే రెండో అంచె చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement