ప్రొ హాకీ లీగ్ రెండో అంచె మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా హార్దిక్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొలి అంచెలో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తదుపరి ఈనెల 20 నుంచి 25 వరకు ఆ్రస్టేలియాలోని హోబర్ట్ నగరంలో భారత్ రెండో అంచె మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ అంచె మ్యాచ్‌లకు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలరీత్యా తాను హోబర్ట్ అంచె మ్యాచ్‌ల్లో పోటీపడే భారత జట్టుకు అందుబాటులో ఉండటం లేదని హర్మన్‌ప్రీత్ తెలిపాడు.
హర్మన్‌ప్రీత్ భార్య అమన్‌దీప్ కౌర్ ప్రసవ తేదీ దగ్గర్లో ఉండటంతో హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా హోబర్ట్ అంచె మ్యాచ్‌లకు భారత జట్టు సారథ్య బాధ్యతలు మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్‌కు అప్పగించారు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టులో హార్దిక్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు.
తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్ వేదికగా ఈనెల 21న స్పెయిన్‌తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్‌తో, 25న ఆ్రస్టేలియాతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది.
భారత పురుషుల హాకీ జట్టు: సూరజ్ కర్కేరా, మోహిత్ హొనెన్నహళ్లి శశికుమార్ (గోల్‌కీపర్లు), అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, అమన్‌దీప్ లాక్రా, యశ్‌దీప్ సివాచ్, పూవణ్ణ చందురబాబీ(డిఫెండర్లు), రాజిందర్ సింగ్, మన్‌మీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, హార్దిక్ సింగ్, మొయిరంగ్తెమ్ రబీచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్, రాజ్‌కుమార్ పాల్ (మిడ్‌ఫీల్డర్లు), అభిషేక్, శిలానంద్ లాక్రా, మన్‌దీప్ సింగ్, అరిజిత్ సింగ్ హుండల్, ఆదిత్య అర్జున్ లలాగే, అంగద్‌బీర్ సింగ్, మణీందర్ సింగ్ (ఫార్వర్డ్స్).


