దోహా: భారత యువ షూటర్ సురుచి సింగ్... అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) సీజన్ చివరి వరల్డ్‌కప్ ఫైనల్లో పసిడి పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సురుచి 245.1 పాయింట్లతో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. ఇదే విభాగంలో పోటీపడిన భారత మరో షూటర్ సైన్యం 243.3 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది.
ఒలింపిక్ పతక విజేత మనూ భాకర్ 179.2 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో సురుచి 586, మనూ భాకర్ 578, సైన్యం 573 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సామ్రాట్ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు.
ఫైనల్లో సామ్రాట్ 221.5 పాయింట్లు సాధించాడు. తొలి రోజు పోటీల్లో భారత ఎయిర్ రైఫిల్ షూటర్లు నిరాశ పరిచారు. రుద్రాం„Š పాటిల్, అర్జున్ బబూతా వరుసగా నాలుగు, ఆరో స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఎలవెనిల్ వలరివన్ 9వ స్థానంతో సరిపెట్టుకుంది.


