విశాఖలో 'విజయ పతాక' | India beat South Africa by 9 wickets in the final ODI | Sakshi
Sakshi News home page

విశాఖలో 'విజయ పతాక'

Dec 7 2025 2:56 AM | Updated on Dec 7 2025 2:56 AM

India beat South Africa by 9 wickets in the final ODI

చితగ్గొట్టిన టాపార్డర్‌ 

జైస్వాల్‌ సెంచరీ 

రో–కో ఫిఫ్టీ–ఫిఫ్టీ

ఆఖరి వన్డేలో 9 వికెట్లతో జయభేరి

2–1తో సిరీస్‌ వశం

భారత టాపార్డర్‌ బ్యాటర్లు సిరీస్‌ గెలిపించారు. యశస్వి జైస్వాల్‌ అజేయ శతకంతో కదం తొక్కగా, సీనియర్‌ సూపర్‌ స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఫిఫ్టీలతో మెరిపించారు. అంతకుముందు పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ జోరందుకున్న సఫారీపై నిప్పులు చెరిగాడు. ఇతనికి తోడుగా కుల్దీప్‌ యాదవ్‌ తిప్పేశాడు. దీంతో పరుగుల పరంగా ఎటో వెళ్లాల్సిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా 48 ఓవర్లయినా పూర్తిగా ఆడలేక ఆలౌటైంది. అలా విశాఖలో టీమిండియా విజయ పతాకాన్ని ఎగురవేసింది.

సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయి దిగాలు పడిన టీమిండియా తెలుగు నేలపై తెగ మురిసే విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన చివరి వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. మొదట సఫారీ జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్‌ డికాక్‌ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. బవుమా (67 బంతుల్లో 48; 5 ఫోర్లు) రాణించాడు. 

ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ చెరో 4 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ 39.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’యశస్వి జైస్వాల్‌ (121 బంతుల్లో 116 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వన్డే సెంచరీ సాధించాడు. రోహిత్‌ (73 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’కోహ్లి (45 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. 9న కటక్‌లో జరిగే తొలి టి20తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ మొదలవుతుంది. 

ఆదుకున్న డికాక్‌
20 ఓవర్లయిపోయాయి. దక్షిణాఫ్రికా జట్టు స్కోరేమో వంద దాటేసింది. ఇంకేం మరో పరుగుల విందు గ్యారంటీ అనిపించింది ఒక దశలో! ఇంతలో 21వ ఓవర్‌ ఆఖరి బంతికి కెప్టెన్‌ బవుమాను జడేజా అవుట్‌ చేశాడు. ఇదొక్కటి సఫారీ జోరును, స్కోరును వారి బ్యాటింగ్‌ తీరునే మార్చేసింది. అన్ని ఓవర్ల (50)ను ఆడకుండా చేసింది. బ్యాటర్లనంతా ఆలౌట్‌ చేసింది. ఇదంతా కూడా మరుసటి 27 ఓవర్లలోనే జరిగింది. 

300 పైచిలుకు ఖాయమనుకున్న స్కోరు 270 పరుగుల వద్దే ఆగిపోయింది. 21వ ఓవర్‌ నుంచి 48 ఓవర్‌ ముగియక ముందే 156 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కూలడంతోనే సఫారీ అధోగతి పాలైంది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగగానే రికెల్టన్‌ (0) వికెట్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికాను డికాక్, కెప్టెన్‌ బవుమా నడిపించారు. ఇద్దరు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. బవుమాను అవుట్‌ చేసిన జడేజా అంతా మార్చేశాడు. తర్వాత వచ్చిన వారెవరూ ప్రసిధ్‌ పేస్‌ను, కుల్దీప్‌ స్పిన్‌ను ఎదుర్కోలేకపోయారు.

జైస్వాల్‌ ధమాకా
ఈ సిరీస్‌లో వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు కలిసి అవలీలగా 600 పైచిలుకు స్కోర్లు చేయడం చూసిన మనకు ఈ స్కోరును చూస్తే ఏమంత కష్టసాధ్యం కాదని ఇట్టే తెలిసిపోతుంది. అందుకు తగ్గట్లే ఓపెనర్లు రోహిత్, జైస్వాల్‌ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టారు. 10.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. 20వ ఓవర్లో వందకు చేరింది. 25వ ఓవర్లోనే 150 పరుగులకు చేరడంతోనే గెలుపు పిలుపు వినిపించింది. 

ఈ క్రమంలో ముందుగా రోహిత్‌ 54 బంతుల్లో తర్వాత జైస్వాల్‌ 75 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. తొలివికెట్‌కు 155 పరుగులు జోడించాక రోహిత్‌ జోరుకు కేశవ్‌ మహరాజ్‌ కళ్లెం వేశాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి వచ్చి రావడంతోనే చేదంచేపనిలో పడ్డాడు. చూడచక్కని బౌండరీలు స్ట్రోక్‌ ప్లేతో జైస్వాల్‌ 111 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకోగా... కాసేపటికే కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. 

మనం టాస్‌ గెలిచామోచ్‌!
విశాఖలో మ్యాచ్‌ మొదలయ్యే ముందు ‘టాస్‌ కా బాస్‌’.... మ్యాచ్‌ ముగిశాక ‘సిరీస్‌ కా బాస్‌’రెండు టీమిండియానే! కీలకమైన మ్యాచ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టాస్‌ గెలిచాడు. వరుసగా 20 మ్యాచ్‌ల్లో టాస్‌లు ఓడిన భారత్‌ ఎట్టకేలకు 21వ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గింది. టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్‌ సుందర్‌ను పక్కనబెట్టి హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మకు తెలుగు గడ్డపై మ్యాచ్‌ ఆడే అవకాశం కల్పించారు.

20,048
‘హిట్‌మ్యాన్‌’రోహిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో చేసిన పరుగులివి. టెస్టులు, వన్డేలు, టి20 ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల పైచిలుకు పరుగులు చేశాడు.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) ప్రసిధ్‌ 106; రికెల్టన్‌ (సి) రాహుల్‌ (బి) అర్ష్ దీప్ 0; బవుమా (సి) కోహ్లి (బి) జడేజా 48; బ్రీట్‌కి (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్‌ 24; మార్క్‌రమ్‌ (సి) కోహ్లి (బి) ప్రసిధ్‌ 1; బ్రెవిస్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 29; యాన్సెన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 17; బాష్‌ (సి) అండ్‌ (బి) కుల్దీప్‌ 9; కేశవ్‌ నాటౌట్‌ 20; ఎన్‌గిడి (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 1; బార్ట్‌మన్‌ (బి) ప్రసిధ్‌ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్‌) 270. వికెట్ల పతనం: 1–1, 2–114, 3–168, 4–170, 5–199, 6–234, 7–235, 8–252, 9–258, 10–270. బౌలింగ్‌: అర్ష్ దీప్ 8–1–36–1, హర్షిత్‌ 8–2–44–0, ప్రసిధ్‌ కృష్ణ 9.5–0–66–4, జడేజా 9–0–50–1, కుల్దీప్‌ 10–1–41–4, తిలక్‌ వర్మ 3–0–29–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ నాటౌట్‌ 116; రోహిత్‌ (సి) బ్రీట్‌కి (బి) కేశవ్‌ 75; కోహ్లి నాటౌట్‌ 65; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (39.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 271. వికెట్ల పతనం: 1–155. బౌలింగ్‌: యాన్సెన్‌ 8–1–39–0, ఎన్‌గిడి 6.5–0–56–0, కేశవ్‌ 10–0–44–1, బార్ట్‌మన్‌ 7–0–60–0, బాష్‌ 6–0–53–0, మార్క్‌రమ్‌ 2–0–17–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement