టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.
రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్( (34357), విరాట్ కోహ్లీ (27910), రాహుల్ ద్రవిడ్ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఈ ముంబైకర్ 50 సెంచరీలు నమోదు చేశాడు.
వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్(264) పేరిటే ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఈ హాఫ్ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
సచిన్ రికార్డు బ్రేక్
👉సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్‌గా సఫారీలపై మూడు ఫార్మాట్‌లు కలిపి 1758 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1734) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు.
👉అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 79 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(78)ను అధిగమించాడు.
డికాక్ సెంచరీ..
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు.
అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(83), విరాట్ కోహ్లి(7) ఉన్నారు.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్‌లోనే!


