సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. సఫారీ జట్టుతో తొలి టీ20 నుంచే అతడు అందుబాటులోకి రానున్నాడు.
ఫిట్‌నెస్ సాధించాడు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వర్గాలు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించాయి. గిల్ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించినట్లు తెలిపాయి. ఈ మేరకు.. ‘‘CoEలో శుబ్‌మన్ గిల్ తన పునరావాసం పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడేందుకు ఫిట్‌నెస్ సాధించాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో డిసెంబరు 9న కటక్ వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA T20Is) మధ్య మొదలయ్యే టీ20 సిరీస్‌కు గిల్ అందుబాటులోకి రానున్నాడు. కాగా స్వదేశంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. సఫారీల చేతిలో భారత జట్టు 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.
మెడనొప్పి కారణంగా..
ఇదిలా ఉంటే.. తొలి టెస్టు సందర్భంగానే గిల్ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత.. అతడు రెండో టెస్టుతో పాటు.. వన్డే సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.
ఈ క్రమంలో గిల్ టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ప్రొటిస్ టీమ్‌తో పొట్టి సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటిచ్చిన యాజమాన్యం ఫిట్‌నెస్ ఆధారంగా జట్టుతో కొనసాగేది.. లేనిది తేలుతుందని పేర్కొంది. తాజాగా గిల్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినట్లు వెల్లడించింది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్, ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్
👉మొదటి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా
👉రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్, చండీగఢ్
👉మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
👉నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్
👉ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.


