భారత్‌తో కీలక మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. పేసర్ నండ్రీ బర్గర్ (Nandre Burger), బ్యాటర్ టోనీ డీ జోర్జి (Tony de Zorzi) గాయాల కారణంగా విశాఖపట్నం మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికా క్రికెట్ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది.
గాయాల కారణంగా..
టీమిండియాతో రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే సందర్భంగా.. ఫాస్ట్ బౌలర్ నండ్రీ బర్గర్‌కు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. మరోవైపు.. డి జోర్జి కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరనికి శుక్రవారం స్కానింగ్‌కు పంపగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
టీ20 సిరీస్ మొత్తానికి అతడు దూరం
ఫలితంగా బర్గర్, డి జోర్జికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ వెల్లడించింది. డి జోర్జి భారత్‌తో ఆఖరి వన్డేతో పాటు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొత్తానికి కూడా దూరమైనట్లు తెలిపింది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.
క్వెనా మఫాకా సైతం..
అదే విధంగా.. యువ ఫాస్ట్ బౌలర్ క్వెనా మఫాకా కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రొటిస్ బోర్డు.. అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలిపింది. కాబట్టి టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. జట్టు నుంచి అతడు నిష్క్రమించాడని.. మఫాకా స్థానంలో లూథో సిపామ్లను టీ20 జట్టులోకి చేర్చినట్లు వెల్లడించింది.
టెస్టులలో పైచేయి.. వన్డేలలో 1-1తో..
కాగా టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత ఆతిథ్య జట్టును టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ చేశారు సఫారీలు.
ఇక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన ప్రొటిస్ జట్టు.. రెండో వన్డేలో గెలిచి 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే ఆఖరిదైన శనివారం నాటి మూడో వన్డేకు విశాఖపట్నం వేదిక. ఆ తర్వాత డిసెంబరు 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌కు తెరలేస్తుంది.


