జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌కు రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. గతంలో ఐరోపా దేశాల్లో క్రికెట్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఐపీఎల్ లాంటి లీగ్‌ల పుట్టుకతో క్రికెట్ విశ్వవ్యాప్తంగా సుపరిచితమైంది.
ఐపీఎల్ సక్సెస్‌తో క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న దేశాల్లో కూడా లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అమెరికా, నేపాల్ లాంటి దేశాల్లో కొత్తగా లీగ్‌లు ప్రారంభం కావడమే ఇందుకు ఉదాహరణ. కొత్తగా న్యూజిలాండ్‌లో కూడా పెద్ద ఎత్తున టీ20 లీగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ లాంటి లీగ్‌లతో క్రికెట్ క్యాలెండర్ కిక్కిరిసిపోయింది.
ప్రైవేట్ లీగ్‌ల్లో డబ్బు అధికంగా ఉండటంతో భారత ఆటగాళ్లు మినహా అంతర్జాతీయ ఆటగాళ్లంతా లీగ్‌లపైపే మొగ్గు చూపుతున్నారు. నికోలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి ఆటగాళ్లైతే తమ అంతర్జాతీయ కెరీర్‌లను అర్దంతరంగా వదులుకొని లీగ్ క్రికెట్‌తో బిజీ అయిపోయారు.
ప్రపంచవాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక చోట ఏదో ఒక లీగ్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు దేశాని కంటే లీగ్ క్రికెట్ ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లంతా ఇలా దేశానికి ఆడకుండా ప్రైవేట్ లీగ్‌ల బాట పడితే అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
స్టార్లు లేకుంటే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగినా అభిమానుల ఆదరణ ఉండదు. లీగ్‌ల విప్లవం కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడమే అంతంతమాత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు జాతీయ విధులకు డుమ్మా కొట్టి లీగ్ క్రికెట్‌కు ఓటేస్తే అంతర్జాతీయ క్రికెట్ మనుగడ కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ మనుగడకు ఆటగాళ్ల లభ్యత ఓ సమస్య అయితే.. కిక్కిరిసిన లీగ్‌ల షెడ్యూల్ మరో సమస్య. ఐపీఎల్ లాంటి లీగ్ ఏడాదిలో దాదాపు రెండు నెలలు జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఇక్కడే ఉండిపోతారు.
ఈ లెక్కన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రెండు నెలలు తీసేయాల్సిందే. బిగ్ బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ లాంటి మిగతా అగ్రశ్రేణి లీగ్‌లకు ఒక్కో నెల కేటాయించినా మిగతా 10 నెలలు ఇక్కడే గడిచిపోతాయి.
ఇలా, ఏడాదంతా ఏదో ఒక లీగ్ జరుగుతుంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయి. జరిగినా ఆటగాళ్లు ఎలా అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో పని కానిచ్చినా ఆదరణ ఎలా లభిస్తుంది. ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకుంటే అంతర్జాతీయ క్రికెట్ కనుమరుగు కావడం ఖాయమని అనిపిస్తుంది.
ఇప్పటికైతే భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి దేశాలకు చెందిన ఆటగాళ్లు లీగ్‌లపై పెద్దగా మోజు పెంచుకోకుండా జాతీయ విధులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము.
ఎందుకంటే ఆటగాళ్లకు లీగ్‌ల ఫ్రాంచైజీల నుంచి ఆర్దిక పరమైన ప్రలోభాలు పెద్ద ఎత్తున ఉంటాయి. తాజాగా ఓ క్రికెట్ ఫ్రాంచైజీ జాతీయ విధులు వదిలిపెట్టి, తమతో పాటే ఉండాలని ఇద్దరు ఆసీస్ క్రికెటర్లకు కోట్లకు కోట్లు ఆఫర్ చేసిందనే వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పట్ల ఎంత నిబద్దత ఉన్న ఆటగాళ్లైనా టెంప్ట్ అవ్వాల్సిందే.


