వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 6) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.
వైజాగ్ వన్డే ప్రారంభానికి ముందు అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
కోహ్లి ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. వైజాగ్ పిచ్ కూడా కోహ్లికి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్‌కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతనాడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 97.83 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ద శతకాలు ఉన్నాయి.
స్ట్రయిక్‌రేట్ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు. వైజాగ్‌లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లి హ్యాట్రిక్ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి.
పిచ్ స్వభాగం కోహ్లి బ్యాటింగ్ శైలికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్‌కు అవకాశమున్నా, బంతి బ్యాట్ వద్దకు సలువుగా వస్తుంది. ఈ పరిస్థితి కోహ్లిని రెచ్చిపోయేలా చేస్తుంది. బలంగా షాట్లు ఆడటం కంటే, టైమింగ్, బ్యాలెన్స్, ప్లేస్‌మెంట్‌ను నమ్ముకునే కోహ్లి బంతి బ్యాట్ వద్దకు వస్తే చెలరేగిపోతాడు.
కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వైజాగ్‌లోని చిన్న బౌండరీలు మరో కారణం. పిచ్ ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి, కోహ్లి తన సహజశైలిలో పంచ్ షాట్లు, డ్రైవ్‌లు ఆడితే సులువుగా బౌండరీలు వస్తాయి. కోహ్లికి పెద్దగా స్ట్రయిక్ రొటేట్ చేసే పని కూడా ఉండదు. పిచ్ స్వభావం, చిన్న బౌండరీలు ఉండటం చేత కోహ్లి వేగంగా పరుగులు చేయడంతో పాటు భారీ సెంచరీ చేసే ఆస్కారముంది.
కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వీటన్నిటి కంటే ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. అదేంటంటే.. బలహీనమైన దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా ఎంత బలహీనంగా ఉందో గత మ్యాచ్‌లో స్పష్టమైంది.
ప్రధాన పేసర్లు ఎంగిడి, జన్సెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో ప్రధాన పేసర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఈ ముగ్గురూ బరిలోకి దిగినా పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. స్పిన్నర్లను కోహ్లి ఎంత అలవోకగా ఎదుర్కోగలడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు.


