టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఐపీఎల్‌లో అతడి ఆట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు.
అదేవిధంగా రో-కో ద్వయం కూడా కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నప్పటికి వారిని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ 2025 ఏడాదిలో వీరి ముగ్గురుని ఓ యువ క్రికెటర్ అధిగమించాడు. అతడి గురుంచి తెలుసుకునేందుకు నెటజన్లు గూగుల్‌లో తెగ వెతికేశారు. అతడే భారత అండర్-19 సంచలనం, ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది గూగుల్‌లో భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ వండర్ కిడ్ ఐపీఎల్, ఇండియా 'ఎ'మ్యాచ్‌లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకర్షించాడు. దీంతో అతడి గురుంచి తెలుసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపారు. వైభవ్ 12 ఏళ్ల వయస్సలోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.
కాగా గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' నివేదిక ప్రకారం.. వైభవ్ అగ్రస్ధానంలో ఉండగా మరో యువ సంచలనం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్దానంలో అభిషేక్ శర్మ మరియు షేక్ రషీద్ నిలిచారు. అదేవిధంగా మహిళల ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ గురుంచి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు.
చదవండి: ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్!


